kanakamedala ravindra kumar pawan kalyan movie price issueఆంధ్రప్రదేశ్ లో వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ… జనసేన పార్టీని నడిపిస్తోన్న పవన్ కళ్యాణ్ సినిమాలే. పవన్ నటించిన సినిమాను టార్గెట్ చేసుకుని టికెట్ ధరలను తగ్గించగా, అది సినీ ఇండస్ట్రీ సమస్యగా మారిందని, ఆ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పార్లమెంట్ లో ప్రస్తావించారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా, ఉద్దేశపూర్వకంగా ఇలా ఇండస్ట్రీ వర్గాలను ఇబ్బంది పెడుతోందని తెలిపిన కనకమేడల, ఆంధ్రప్రదేశ్ గంజాయికి హబ్ గా మారిందని ఆరోపించారు. అలాగే ఓ క్యాబినేట్ మంత్రి ఆధ్వర్యంలో కేసినో తరహా సంస్కృతిని తీసుకువచ్చారని వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో వైసీపీ ఎంపీలు ‘విజయసాయిరెడ్డి అండ్ కో’ మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డారు.

రాష్ట్రం కోసం పార్లమెంట్ లో ఏ మాత్రం ప్రసంగించలేని వైసీపీ ఎంపీలు, తమ తప్పులను ఎత్తి చూపుతుంటే మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో కనకమేడల వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రసంగం పార్లమెంట్ లో అయితే పెద్ద దుమారాన్నే రేపింది.

పవన్ కళ్యాణ్ సినిమాలను ఉదహరిస్తూ చేయడం వలన జనసైనికులు కూడా కనకమేడల వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మరో టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా రాష్ట్రానికి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వైనం తెలిసిందే.