Kanakamedala_Ravindra_Kumarనిధుల కొరతతో సతమతమవుతున్న వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పధకమే దాని మెడకు గుదిబండగా మారిందని, కనుక దాని భారం తగ్గించుకోవడానికే జగన్ సర్కార్ 2 లక్షల మంది పదో తరగతి విద్యార్దులను ఫెయిల్ చేసిందని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఆరోపించారు.

అమ్మఒడి భారాన్ని కొంచెమైన తగ్గించుకోవాలనే ఆలోచనతో ముందుగానే కొన్ని కొత్త నిబందనలు విధించి, పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహించి చివరికి రెండు లక్షల మందికి పైగా విద్యార్దులను ఫెయిల్ చేసిందని ఆరోపించారు.

నెలనెలా కేంద్రప్రభుత్వం నిధులు విధిలిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని కనకమేడల ఎద్దేవా చేశారు. ఇదే విషయం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడ, రాజమండ్రిలలో బహిరంగసభలు పెట్టి మరీ చెప్పినా జగన్ సర్కారు స్పందించకపోవడం గమనిస్తే ఏపీ వాస్తవ పరిస్థితి దయనీయంగా ఉందని అంగీకరించినట్లు అర్దమవుతోందని కనకమేడల అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న వైసీపీ వర్క్ షాపులలో ఎన్నికలు, సంక్షేమ పధకాల గురించి చర్చిస్తుంటారు కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఫలితాల గురించి ఎందుకు చర్చించలేదని కనకమేడల ప్రశ్నించారు. విద్యావ్యవస్థ పట్ల వైసీపీకి నిబద్దత లేదని చెప్పడానికి ఇదే ఓ నిదర్శనమని అన్నారు.

గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తుండటంతో వైసీపీ నేతలు సహనం కోల్పోయి ప్రజలపై దాడులు చేయడం చూస్తే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దమవుతుందని కనకమేడల అన్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని గొప్పలు చెప్పుకొన్నా వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్మించలేకపోయినా కనీసం అమరావతిలో టిడిపి ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలు కాకుండా కొత్తగా ఒక భవనాన్ని కూడా నిర్మించలేకపోయిందని, పైగా టిడిపి ప్రభుత్వం నిర్మించిన సచివాలయం లోనే కూర్చొని మంత్రులు నిసిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నారని కనకమేడల ఎద్దేవా చేశారు.

ఒక దళిత యువకుడు (కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం)ను వైసీపీ ఎమ్మెల్సీ అనంతాబాబు హత్య చేయడమే కాకుండా తన కారులోనే శవాన్ని తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించడం, అతనిని పోలీసులు అరెస్ట్ చేయడానికి నాలుగు రోజులు మీనమేషాలు లెక్కించడం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం అవుతోందని కనకమేడల ఎద్దేవా చేశారు.