kanagana-ranaut-an-unwanted-childతన తల్లిదండ్రులు ‘కోరుకోని బిడ్డ’గా తాను జన్మించానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సర్వత్రా సంచలనం సృష్టించాయి. అయితే ఆ వ్యాఖ్యలు నిజమేనని కంగనా తండ్రి అమర్ దీప్ రనౌత్ సమర్ధించారు. “కంగనా పుట్టిన సమయంలో మా గ్రామంలో పరిస్థితి అలాంటిదేనని, ఆడపిల్ల పుట్టిందంటే సంబరాలు చేసుకునే స్థితి లేదని, ఆడపిల్ల జన్మ అంటే చావు కన్నా పెద్ద బాధ కిందే లెక్కనని, ఊళ్లో వాళ్లంతా వచ్చి ఆడపిల్లా అని పెదవి విరిచి వెళ్లేవారని, అందుకే బిడ్డ పుట్టిందన్న ఆనందం తమకు లేకుండా పోయిందని” తన అనుభూతులను పంచుకున్నారు ఈ హిమాచల్ ప్రదేశ్ వాసి.

“అప్పటికే మాకు ఓ మగబిడ్డ పుట్టి చనిపోయాడు, ఆనాటి మా పరిస్థితి అలాంటిది” అని చెప్పిన కంగనా తండ్రి వ్యాఖ్యలను ఆమె సోదరి రంగోలీ కూడా ఒప్పుకున్నారు. “కంగనా పుట్టిన రోజు ఇంకా గుర్తుంది, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, బంధువులు ఇంటికి వచ్చి బిడ్డ అక్కర్లేదని కూడా అన్నారు, మేం పుట్టిన ఊరు ఇప్పటికీ మారలేదు, బాలికల పట్ల అక్కడ ఇంకా ఇదే స్థితి. కంగనా పెరుగుతున్న కొద్దీ, తన మనసులో బాలికలపై చూపుతున్న వివక్ష ప్రభావం బలంగా నాటుకుపోయింది” అని వ్యాఖ్యానించారు.

అలాంటి వాతావరణం నుండి వచ్చిన కంగనా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఆమె పట్టుదల, స్వయంకృషేనని చెప్పకతప్పాదు. సహజంగా సినిమాలలో మాత్రమే కనిపించే ఇలాంటి కధలు… ఒక మహిళ నిజ జీవితంలో జరగడం… ఆమె సినీ హీరోయిన్ గా అవతరించడం… విశేషమే.