kamla Haasan Comments on Rajinikanth Politicsలెజెండరీ దర్శకుడు బాలచందర్ పరిచయం చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ – యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ‘తన కంటే గొప్ప నటుడు’ అంటూ కమల్ గురించి రజనీ… ‘తనతో పాటు వచ్చినా క్రేజ్ విషయంలో రజనీకి సాటిరారు ఎవరూ’ అంటూ రజనీ గురించి కమల్… బహిరంగంగా ఒకరినొకరు ప్రశంసించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిజానికి అంత మనస్పూర్తిగా ఇద్దరు ఒకరిపై ఒకరు తమ భావాలను పంచుకుంటారు.

మరి అంత స్వచ్ఛత గల వారిద్దరి స్నేహానికి ఇప్పుడు ఏమైంది..? అంటే… “రాజకీయం… రాజకీయం… నువ్వు ఏం చేయగలవు? అంటే ఎంతటి ప్రాణ స్నేహితులనైనా బద్ధ శత్రువులుగా మార్చగలను” అన్న సమాధానం చెప్పినట్లుగా తయారవుతోంది. ప్రస్తుతానికి బద్ధ శత్రువులు కాదు గానీ, వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి తూట్లు పొడిచే విధంగా కమల్ హాసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, రజనీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రజనీ అడుగు పెట్టనున్నారన్న దానిపై స్పందించిన కమల్ చేసిన వ్యాఖ్యలు పర్యవసానం ఇది.

“రజనీకాంత్ కు కెమెరాల షో ఎక్కువని, కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువని, అందుకే రాజకీయాల్లోకి వస్తానని హల్చల్ చేస్తున్నారు” అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను సూపర్ స్టార్ అభిమానులు తప్పుపడుతున్నారు. దీంతో వీరిద్దరి హీరోల అభిమానుల మధ్య ఈ మాటలు చిచ్చురేపాయి. తమ హీరో క్రేజ్ ను ఓర్వలేక కమల్ ఈ రకమైన కామెంట్స్ చేసారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండి పడుతుండగా, రజనీకి అంత సీన్ లేదంటూ కమల్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే ఇది కేవలం అభిమానుల మధ్య యుద్ధంగానే మిగులుతుందా? లేక ఇద్దరి స్టార్ హీరోల మధ్య పొలిటికల్ వార్ కు శ్రీకారం చుడుతుందా? అనేది వేచిచూడాలి. సహజంగా తనంతట తానుగా ఎవరినీ తూలనాడే మనస్తత్వం రజనీది కాదు అని అందరూ చెప్తుంటారు. అలాగే అనవసరపు విమర్శల జోలికి కూడా పెద్దగా వెళ్ళరు అంటుంటారు. కానీ, ఆగష్టు 15వ తేదీన కొత్త పార్టీ ప్రారంభోత్సవం అన్న టాక్ తో రజనీ శైలిలో మార్పు ఏమైనా వస్తుందా? కమల్ కు గట్టిగా కౌంటర్ ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.