Kamineni Srinivas Rally for Rivers Posterనదుల సంరక్షణార్ధం “రాలీ ఫర్ రివర్స్” అనే పేరుతో ఓ క్యాంపైన్ పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సినీ సెలబ్రిటీలు కూడా భాగస్వామ్యం కావడంతో, ప్రజలకు ఎక్కువగా చేరువ అవుతోంది. మన టాలీవుడ్ విషయానికి వస్తే ముందుగా హీరో సుమంత్ దీనిని ప్రారంభించగా, ప్రస్తుతం నాగార్జున వంటి బిగ్ సెలబ్రిటీస్ కూడా దీనిని సపోర్ట్ చేస్తూ వీడియో బైట్ లు ఇచ్చారు. ప్రజల జీవితాలలో ఓ భాగమైన సినీ ప్రముఖులతో పాటు… ప్రజలే జీవితంగా గడపాల్సిన రాజకీయ నేతలు కూడా ఈ “రాలీ ఫర్ రివర్స్”లో భాగస్వామ్యులు అవుతున్నారు.

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారికంగా ఓ కార్యక్రమం కూడా జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటోలో “నదుల రక్షణ” అంటూ అందరూ ప్లకార్డులు పట్టుకోగా, అందులో మంత్రి కామినేని శ్రీనివాస్ పట్టుకున్న విధానం, వీక్షకులకు హాస్యాన్ని పంచుతోంది. ఇంగ్లీష్ భాషలో ఉన్న ‘తికమక’ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సిఎం చంద్రబాబుతో సహా అందరూ ప్లకార్డులను మీడియా మిత్రులకు చూపిస్తూ పట్టుకోగా, కామినేని మాత్రం దానిని ‘రివర్స్’లో పట్టుకున్నారు.

ఈ సందర్భంలో ‘రివర్స్’ అంటే అసలు అర్ధం ‘నదులు’ కాగా, కామినేని పట్టుకున్న తీరు మరో ‘రివర్స్’ అయ్యింది. దీంతో ఈ ఫోటోను షేర్ చేసుకుంటున్న నెటిజన్లు… ‘రివర్స్’ అంటే ‘రివర్స్’లో పట్టుకోమని కాదు… అంటూ చలోక్తులు విసురుతున్నారు. ఒక్కో సారి జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఎంతటి హంగామా సృష్టిస్తాయో ఈ ఫోటోనే నిదర్శనం. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి గారైనా… చూడకుండా అలా ఎలా పట్టేసుకుంటారు… ఇదేమి “రివర్స్” మేళం బాబోయ్… అనుకోవడం నెటిజన్ల వంతవుతోంది.