Kamalananda Bharati Swamyఅమరావతి నుండి రాజధానిని తరలించడం పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం హిందుత్వ రంగు పులుముపోవడం విశేషం. మందడంలో ఆందోళన చేస్తున్న రైతులు, ప్రజలకు హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి సంఘీభావం తెలిపారు.

ముద్ద ముద్దకూ బిస్మిల్లా చేయరని, అలాగే రాజధానికి కూడా ఒక్కసారే శంకుస్థాపన చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన రోజు ఎవరూ అడగలేదన్నారు. అమరావతి ఉద్యమాన్ని కొనసాగించాలని కమలానంద పిలుపునిచ్చారు. మీ భద్రత, భవిష్యత్ జీవితం అంతా అమరావతితోనే ముడిపడి ఉందని అక్కడి ప్రజలకు సూచించారు.

ఇది 29 గ్రామాల ప్రజల రాజధాని కాదని, 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని అన్నారు. రాజధాని అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని తెలిపారు. అమరావతి ఉద్యమం జిల్లాల వారీగా విస్తరిస్తే.. ప్రజాబలం పెరుగుతుందన్నారు. ఇక పోతే మరోవర్గం అమరావతి శంకుస్థాపన హిందూ మతవిశ్వాసాల ప్రకారం జరిగిందని, ఇప్పుడు రాజధానిని తరలిస్తే హిందూ మతం మీదే నమ్మకం పోతుంది అనడం విశేషం.

క్రైస్తవుడైన జగన్ ఒక పథకం ప్రకారం ఇలా చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే రాజధాని పై రాజకీయం చెయ్యడానికి ఇది బీజేపీ వారి పన్నాగం అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ట్రిక్స్ ఆంధ్రప్రదేశ్ లో పనిచెయ్యవని వారు అంటున్నారు.