pawan klayna ajokerపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా కొలిచే అభిమానులకు కొదవలేదు. అలాగే పవన్ అంటే పడి చచ్చే సినీ సెలబ్రిటీల సంఖ్య కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టే వారైతే పవన్ ‘నామజపం’ చేయకుండా ఉండలేరు. అంతలా తన అభిమాన గణాన్ని పవన్ విస్తరించుకుని, తన ఉనికిని చాటుకున్నారు.

అలాంటి అభిమానుల పాలిట దేవుడు పవన్ కళ్యాణ్ ను ఒక “జోకర్” అంటూ వ్యాఖ్యానించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు అయిన కమల్ ఖాన్. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కమల్ ఖాన్ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాలకు కొత్త కాదు. అయితే హిందీలో కూడా “సర్ధార్ గబ్బర్ సింగ్”ను విడుదల చేసి సత్తా చాటాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తన ట్వీట్లతో విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

“పవన్ కళ్యాణ్ హీరో అయితే, ఈ ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ అయిపోవచ్చని” అన్న కమల్, “దక్షిణాది ప్రేక్షకులకు అసలు ఏమైంది? పవన్ కళ్యాణ్ వంటి కార్టూనిస్ట్ ముఖాలను హీరోగా అంగీకరిస్తారా? నిజంగా వారిది చాలా బ్యాడ్ ఛాయిస్!” అంటూ హీరోపైనే కాదు, సౌత్ ఇండియా ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసారు ఈ ప్రముఖ నటుడు. “జోకర్, కార్టూన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కంటే కూడా నేను రాజ్ పాల్ యాదవ్ సినిమాలు ఇష్టపడతానని” చెప్తూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు ఫోటోలను పోస్ట్ చేసారు.

ఈ వ్యాఖ్యలతో పవన్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఒక పక్కన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టీజర్ విడుదల అవుతోందన్న ఆనందంతో ఎదురుచూసిన పవన్ అభిమానులకు, అంతకంటే ముందుగా ఈ మంటెక్కించే ట్వీట్లు తారసపడ్డాయి. దీంతో కమల్ పై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఉదంతం చూస్తున్న ప్రేక్షకులకు గతంలో వర్మ – పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన “వార్” జ్ఞప్తికి వస్తోంది.