Jyotiraditya Scindia - Amit Shah-మధ్యప్రదేశ్‌ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కమల్‌నాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్ష కంటే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయనకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆయనకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు నిరాకరించడంతో బీజేపీ రంగంలోకి దిగి ఆయనను రాజ్యసభకు పంపింది.

త్వరలో కేంద్ర కేబినెట్ లోకి కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఈరోజే శివరాజ్ సింగ్ చౌహన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. గతంలో కర్ణాటకలో కూడా బీజేపీ ఇలానే అక్కడి ప్రభుత్వాలను కూలదోసింది. మధ్య ప్రదేశ్ ని సాధించడంతో తమ తరువాతి టార్గెట్ రాజస్థాన్, మహారాష్ట్ర అని ఆ పార్టీ వారు ఓపెన్ గానే ప్రకటిస్తున్నారు.

ఒక పక్క దేశమంతా కరోనా వైరస్ భయంతో వొణికిపోతున్నా బీజేపీ మాత్రం తన రాజకీయాలను వదలకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు బీజేపీ రాష్ట్రాన్ని వరుసగా పదిహేనేళ్ళ పాటు పాలించిన విషయం తెలిసిందే. 2005 నుండి 2018 వరకు శివరాజ్ సీఎంగా ఉన్నారు.