‘బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న సీక్రెట్ మరో ఆరు రోజుల్లో రివీల్ కానుంది. అయితే చిత్ర యూనిట్ కు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా! దీంతో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న యూనిట్ సభ్యులకు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. దీంతో పలు రకాలుగా ప్రశ్నలు సంధిస్తూ… యూనిట్ సభ్యుల నుండి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతకు మించిన స్థాయిలో సదరు మెంబర్లు తప్పించుకునే విధంగా జవాబులు చెప్తున్నారు.

ప్రపంచ సినీ ప్రేక్షక లోకానికి ఈ దశాబ్దపు అతి పెద్ద సస్పెన్స్ గా నిలిచిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ ప్రశ్నకు సమాధానం ఒక్క రాజమౌళికి మాత్రమే తెలుసని… ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ను తీర్చిదిద్దిన కమల్ కణ్ణన్ తెలిపారు. ఈ సీన్లను చిట్టచివరిగా తెరకెక్కించారని, ఆ సీన్లలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు చోటు లేకపోవడంతో, తనకు కారణం తెలియదని అన్నారు. తప్పించుకోవడానికి లాజికల్ గా సమాధానం బాగానే చెప్పారు గానీ, కమల్ కణ్ణన్ కు తెలియదని చెప్పడం పబ్లిసిటీ ట్రిక్కే అంటున్నారు సినీ జనాలు.

ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ను జర్మనీలో సర్వర్ ను ఉంచి, అక్కడి నుంచే ఎవరికి ఏ సన్నివేశం కావాలన్నా తీసుకునే ఏర్పాటు చేశామని, అందువల్లే ఏ సీన్ కూడా లీక్ కాలేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 36 స్టూడియోల్లో 2,226 షాట్స్ కు వీఎఫ్ఎక్స్ చేశామని, 1000 మంది టెక్ నిపుణులు 18 నెలల పాటు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. ఇంతగా శ్రమించారు కాబట్టే, ట్రైలర్ లోని షాట్స్ అన్ని అద్భుతంగా, ఫస్ట్ లుక్ లోనే ప్రతి ఒక్కరిని పడేసే విధంగా దర్శనమిచ్చాయని చెప్పవచ్చు.