Kamal Haasan Political Party Nameజయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఒక్కసారిగా ఏర్పడిన రాజకీయ అనిశ్చితి ఇప్పటికీ తొలగలేదంటే, ఏ స్థాయిలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె మరణం తర్వాత ‘కుక్కలు చింపిన విస్తరి’ మాదిరిగా తయారైన తమిళనాడును గాడిలో పెట్టేందుకు స్టార్ హీరోలు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ లు కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ముందుగా రజనీ పొలిటికల్ ఆలోచనలు చేయగా, కాస్త ఆలస్యం అయినా రజనీ కంటే ముందుగా దూసుకొస్తున్నానని కమల్ కార్యాచరణ చెప్తోంది.

రజనీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనా… పార్టీ ప్రకటన తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కానీ కమల్ మాత్రం దూకుడుగా సాగుతూ, పార్టీ ప్రారంభానికి కూడా ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? అంటూ జిల్లాల వారీగా జరుపుతున్న చర్చలలో అభిమానులకు పార్టీ ముహూర్త సమయాన్ని తెలిపినట్లుగా సమాచారం.

నవంబర్ 7వ తేదీన తమిళనాడులో కమల్ చేతుల మీదుగా కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుందని ఈ వార్తల సమాచారం. ఈ దిశగానే అభిమానులకు కమల్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ ప్రకటన తర్వాత అభిమానులు చేయాల్సిన కార్యకలాపాల విషయంలో కూడా స్పష్టత ఇస్తున్నారని, కమల్ జరుపుతున్న చర్చలతో ఫ్యాన్స్ కూడా ఖుషీలో ఉన్నట్లుగా సమాచారం. మొత్తానికి దక్షిణాదిన రజనీ, కమల్, పవన్ వంటి స్టార్ హీరోలు రాజకీయ రంగంలో కూడా సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది.