Kamal Haasan controversial words on hinduతమిళనాట కమల్‌ హాసన్‌ రాజకీయాలని సీరియస్ గా తీసుకుంటున్నారు. మరో సూపర్ స్టార్ రజినీకాంత్ లా కాకుండా ఆయన నికార్సయిన రాజకీయనాయకుడిగా అవతారమెత్తారు . తమిళనాడులో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఆయన పార్టీ మక్కల్‌ నీది మయ్యుం తరపున అభ్యర్థులను నిలబెట్టారు. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’’ అని కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చారు. ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్‌ అన్నారు.

కమల్ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. 2017 నవంబరులో మే 19న అరవకురిచి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంలో తన పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన ‘హిందూ తీవ్రవాదం’ అనే పదజాలం ఉపయోగించారు. కమల్‌ వ్యాఖ్యల్ని అప్పట్లో భాజపాతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాజకీయాలలో మార్పు తెస్తా అంటూ ప్రజా మద్దతు కోరుతున్న కమల్ వంటి వారు ఇటువంటి సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా ఉంటే అది ఆయనకే మంచిది.