తమిళ, తెలుగు రంగాల్లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న ‘యూనివర్సల్ స్టార్’ కమల్‌ హాస‌న్ సోదరుడు చంద్ర‌హాస‌న్ లండ‌న్‌ లో తుది శ్వాస విడిచారు. 82 సంవత్సరాల చంద్రహాసన్, ప్రస్తుతం లండ‌న్‌ లో కుమార్తె వ‌ద్ద ఉంటుండగా, గుండెపోటు కారణంగా ఆదివారం నాడు ఉదయం కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి 7న చంద్రహాసన్ భార్య 73 ఏళ్ళ గీతామణి మరణించిన సంగతి తెలిసిందే.

జీవితంలో చివరి అంకంలో ఉన్న చంద్రహాసన్ ను భార్య మరణం తీవ్ర ఆవేదన చెందేలా చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ కారణం వలనే మూడు నెలలు గడవక ముందే ఆయన కూడా కన్నుమూసారని చెప్తున్నారు. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్‌ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్, పలు సినిమాలకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఆయన మృతికి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.