Kamaal R Khancomments on Pawan Kalyan Sardaar Gabbar Singhపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ సంచలన ట్వీట్లతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన కమల్ ఖాన్, మరోసారి పవన్ ను టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డారు. తొలి విడత చేసిన ట్వీట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గుతాడనుకున్న కమల్, ఈ సారి మరింతగా చెలరేగిపోయారు.

సౌత్ లో పవన్ కళ్యాణ్ పెద్ద సూపర్ స్టార్ అయితే తనకేమి అభ్యంతరం లేదని అన్న కమల్, తన సినిమాలను అక్కడే రిలీజ్ చేసుకోవాలి, హిందీలో కాదు అని అన్నారు. దక్షిణాదిలో స్టార్ అయితే ఓకే, అయితే హిందీ సినిమాలలో కనీసం రోడ్ సైడ్ రోల్స్ కు కూడా పవన్ అర్హుడు కాదంటూ ఘాటు విమర్శలు చేసారు. అంతేకాదు, అతని సినిమా హిందీలో విడుదల అయితే, ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా… కుక్కలు కూడా చూడవు… అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ ను, ఆయన అశేష అభిమాన గణాన్ని టార్గెట్ చేసారు కమల్ ఖాన్.

అయితే అసలు పవన్ సినిమా బాలీవుడ్ లో విడుదలైతే కమల్ కేంటి ఇబ్బంది? కళ అనేది భాషలకతీతం. ఒక భాషలోనే విడుదల చేసుకోవాలి అన్న నియమ నిబంధనలు ఏమైనా ఉంటే, అవి ప్రభుత్వాలు చూసుకుంటాయి. అది కాదంటే సినీ సంఘాలు నిర్ణయించుకుంటాయి. మరి ఏ అర్హతతో కమల్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా విశదీకరిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడితే… పర్యవసానాలు ప్రస్తుతం తెలియక పోయినా, భవిష్యత్తులో ఏదొక సందర్భంలో తానూ తప్పు చేశాను అన్న సంగతి గతంలో చాలా మంది విషయంలో నిరూపణ అయ్యింది. బావ స్వేఛ్చ భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కే గానీ, దాన్ని దుర్వినియోగం చేసేందుకు కాదు అన్న విషయాన్ని ఎవరికి వారు గుర్తించి మసలుకుంటేనే ఆ హక్కుకు సార్ధకత ఉంటుంది. లేదంటే ఇలాంటి కొందరి నోటి దురుసు వలన మొత్తం ఆ హక్కుకే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

“కుక్కులు కూడా చూడవు…” అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు ఎంత అర్ధరహితంగా ఉన్నాయో… బహుశా ఆయనకైనా తెలుసా? అంటే ప్రస్తుత బాలీవుడ్ సినిమాలను కుక్కలు కూడా చూస్తున్నాయా? అదే అయితే ఆ కుక్కల జాబితాలో ఉన్న పేర్లు ఏంటో కమల్ చెప్పగలరా? ఇలాంటి అనేక విమర్శలను కమల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఉదంతాన్ని గమనిస్తున్న పవన్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో కమల్ ఖాన్ పై విరుచుకుపడుతున్నారు.