kalyan-ram-mehreen-pirzada-entha-manchivaadavuraa-title-logo-director-satish-vegesnaనందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మెహరీన్‌ కథానాయిక. ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రానికి ‘ఎంత మంచివాడవురా!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం కల్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. ఒక చిన్న వీడియో ద్వారా సినిమా టైటిల్ ని ప్రకటించడం విశేషం. టైటిల్ ని బట్టి వేగేశ్న సతీష్‌ గతంలోలాగానే ఒక సాఫ్ట్ కథతో ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

వర్షంలో తడుస్తున్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండి కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న సమయంలో ‘ఎంత మంచివాడవురా’ అంటూ అక్కినేని నటించిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని పాటతో విడుదల చేసిన ఈ టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న హైదరాబాద్ లో మొదలు అవుతుంది. నాన్ – స్టాప్ గా షూట్ చేసి డిసెంబర్ లో సినిమాను విడుదల చేసే ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం. ఎఫ్ 2 తో పెద్ద హిట్ కొట్టిన మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలోని మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ కూడా చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వరుస ప్లాపుల తరువాత కళ్యాణ్ రామ్ తన గత చిత్రం 118తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు హిట్ చేసుకుని విజయాల పరంపరను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.