Kalvakuntla Kavithaఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమ, మంగళవారం వరుసగా రెండు రోజులు ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యాక బుదవారం ఉదయం ప్రత్యేక విమానంలో భర్త , సోదరుడు కేటీఆర్‌, మంత్రి హరీష్‌ రావు తదితరులతో కలిసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. ప్రత్యేక విమానం కనుక బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి ఆమె నేరుగా తండ్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు చేరుకొన్నారు.

ఈరోజు ఉగాది పండుగ రోజున ఆమె ఇంటికి తిరిగి రావడంతో ఆమె తల్లితండ్రులు కూడా చాలా సంతోషించారు. అందరూ కలిసి ఆనందంగా ఉగాది పండుగ జరుపుకొన్నారు. ఈ రెండు రోజులలో ఈడీ అధికారులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ గురించి తనను ఏమేమి ప్రశ్నలు అడిగారో, వారికి తాను ఏం జవాబులు చెప్పారో బహుశః ఆమె తండ్రి కేటీఆర్‌కు వివరించే ఉంటారు. ఒకవేళ ఈడీ అధికారులు మళ్ళీ ఢిల్లీకి పిలిస్తే వారిని ఈసారి ఏవిదంగా ఎదుర్కోవాలో బహుశః చర్చించే ఉంటారు లేదా న్యాయనిపుణులను సంప్రదించి ఉండవచ్చు.

కానీ గత రెండు రోజులలో విచారణకు హాజరైనప్పుడు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వినిపించినందున కేసీఆర్‌ దంపతులు తీవ్ర ఆందోళన చెంది ఉండవచ్చు. కానీ ఆమెను అరెస్ట్ చేయకుండా ఇంటికి తిరిగి పంపించేసినందుకు అదీ… ఉగాది పండుగనాడు ఆమె ఇంటికి చేరుకొన్నందుకు వారు, పుట్టింటిలో తల్లితండ్రులతో గడపగలిగినందుకు ఆమె కూడా చాలా సంతోషించి ఉండవచ్చు.

ఇక కేసు విషయానికి వస్తే, ఈడీ విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెపితే ఆ తర్వాత ఆమెను విచారించడం ఇబ్బందికరంగా మారుతుంది. కనుక అవసరమనుకొంటే ఆలోగానే ఈడీ ఆమెను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న కల్వకుంట్ల కవిత అప్పుడు ఏదో ఓ కారణంతో వెళ్లకుండా ఉండిపోయి ఈడీని గడువు కోరవచ్చు. కనుక మిగిలిన ఈ రెండు రోజులలో ఏమి జరుగబోతోందనేది చాలా ఉత్కంఠ కలిగించే విషయమే.