Kalvakuntla-Kavitha-In-Liquor-Scamతెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు రేపు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆమె నివాసంలోనే ఉదయం 11 గంటలకి ప్రశ్నించనున్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో ఆమె, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముగ్గురూ ప్రధానపాత్ర పోషించారని సీబీఐ కోర్టుకి సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే శరత్ చంద్ర రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపించబడుతున్న కల్వకుంట్ల కవితని సీబీఐ అధికారులు ప్రశ్నించబోతుండటంతో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సీబీఐ అధికారులు రేపు ఆమెని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేస్తారా లేక ఈ కేసుకి సంబందించి ఆమెని ప్రశ్నించి వెళ్ళిపోతారా?అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ కేసుకి సంబందించి ఎటువంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు కల్వకుంట్ల కవిత ఏడాదిన్నర వ్యవధిలో 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని సీబీఐ నివేదికలో పేర్కొంది. కనుక ముందుగా వాటి గురించి ప్రశ్నించడం మొదలుపెడితే జవాబు చెప్పుకోవడం కష్టమే.

శుక్రవారమే టిఆర్ఎస్‌ పార్టీ పేరు, జెండా అన్ని బిఆర్ఎస్‌గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. బిఆర్ఎస్‌ పార్టీ కర్ణాటక శాసనసభ ఎన్నికలతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి ‘అబ్‌కీ బార్ కిసాన్ కి సర్కార్’ (ఈసారి రైతు ప్రభుత్వం) అనే నినాదం కూడా కేసీఆర్‌ శుక్రవారం ప్రకటించారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి సిద్దమవుతుంటే కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయితే ఆయనకి చాలా ఇబ్బందికరంగా మారుతుందని వేరే చెప్పక్కరలేదు. కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించకుండా బ్రేకులు వేసేందుకే మోడీ సర్కారు ఈ కేసుని ఉపయోగించుకొంటోందా?ఒకవేళ కూతురిని సీబీఐ అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ ఏవిదంగా స్పందిస్తారు? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభించవచ్చు.