Kalvakuntla Kavitha Bhogi Sankranthi Celebrationsతెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ పాలకులు, ప్రజలు, వారి సంస్కృతీ సంప్రదాయాలు, చివరికి వారి వంటలని కూడా తీవ్రంగా అసహ్యించుకొన్న బిఆర్ఎస్‌గా మారిన టిఆర్ఎస్‌ నేతలు, ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టబోతుండటంతో ఒక్కసారిగా వారికి ఏపీపై ప్రేమ పొంగుకొస్తోంది.

బిఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి కూడా భారత్‌ జాగృతిగా మార్చారు. కనుక ఆమె కూడా ఇప్పుడు ఏపీ ప్రజల గురించి, సంస్కృతీ సంప్రదాయాలు, అట్లతద్ది అంటూ ఏపీలో పండుగల గురించి కూడా గలగలా మాట్లాడేస్తున్నారు.

ఏపీ ప్రజలలో కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పట్ల వ్యతిరేకత ఉందని తెలిసిఉన్నప్పటికీ ఏపీలో అడుగుపెట్టక తప్పదని గ్రహించినందునే ఆ పార్టీ నేతలలో అకస్మాత్తుగా ఈ మార్పు వచ్చిందని అర్దమవుతూనే ఉంది.

తెలంగాణలో బతుకమ్మ పండుగకి ఎంత ప్రాధాన్యం ఉందో ఏపీలో సంక్రాంతి గొబ్బెమ్మలకి అంతే ప్రాధాన్యం ఉంది. కానీ అప్పుడు పేడ ముద్దలతో ఆడుకొంటారని ఏపీ ప్రజలని చీదరించుకొన్న బిఆర్ఎస్‌ నేతలే నేడు అదే పేడముద్దలతో హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్ వద్ద గొబ్బెమ్మలు పెట్టి, వాటిని పూలతో అలంకరించి, భోగీ మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. బసవన్నలకి పూజలు చేసి హరిదాసు అక్షయపాత్రలో బియ్యం పోసి గౌరవించారు. కల్వకుంట్ల కవిత ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఏపీని ఇంతగా అసహ్యించుకొంటూ, నేటికీ ఏపీకి పలువిధాలుగా నష్టం కలుగజేస్తూ, ఏపీలో పార్టీని విస్తరించి ప్రజలని ఓట్లు అడగాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీలో పోటీ చేసే ఉద్దేశ్యమే లేకపోయి ఉంటే బిఆర్ఎస్‌ నేతలకి ఇప్పుడు ఈ గొబ్బెమ్మలు, భోగీమంటలు, హరిదాసులు గుర్తుకొచ్చేవారా?