Kalvakuntla Kavithaటిఆర్ఎస్‌ పార్టీ 21 ఏళ్ల చరిత్రలో మొన్న విజయదశమినాడు మరో గొప్ప అధ్యాయం మొదలైంది. ఆరోజు పార్టీలో 283 మంది ప్రజా ప్రతినిధులందరూ తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి హాజరయ్యి టిఆర్ఎస్‌ పార్టీ పేరును బిఆర్ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి)గా మార్చుతూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకొన్నారు.

కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం అత్యంత కీలకమైన ఈ సమావేశానికి హాజరుకాలేదు! పోనీ… ఆ సమయానికి ఆమె ఎక్కడో దూరంగా విదేశాలలో ఉన్నారా అంటే సొంత ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ఆయుధపూజ చేసుకొన్నట్లు ట్విట్టర్‌లో ఫోటో కూడా పెట్టారు. మరి ఇంట్లోనే ఉండి ఇంత ముఖ్యమైన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది.

టిఆర్ఎస్‌ పార్టీని బిఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో బిజీ అవుతారు కనుక తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. కల్వకుంట్ల కవిత తన సోదరుడి అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు కానీ పార్టీలో, ప్రభుత్వంలో తనకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయిందనే ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీగాక… ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తండ్రి కేసీఆర్‌, సోదరుడు కేటీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ తనకు అండగా నిలబడకపోవడం కూడా కల్వకుంట్ల కవితను చాలా బాధించాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అందుకే ఆమె నిరసన తెలియజేసేందుకు టిఆర్ఎస్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్‌, బిఆర్ఎస్‌గా మారడంపై టిఆర్ఎస్‌ ముఖ్య నేతలందరూ కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు, సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. కానీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్‌ గురించి చిన్న ట్వీట్ కూడా చేయలేదు. కనుక కేసీఆర్‌ కుటుంబంలో అసంతృప్తి సెగలు మొదలైనట్లే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక కేసీఆర్‌ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సి ఉంటుంది.