Kalvakuntla Kavithaకేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత బీజేపీ అధినాయకత్వానికి చురకలు అంటించే ప్రయత్నం చేసారు. మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ లో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం అనేది ఆశ్చర్యం ఏమి కాదని తాము ముందే ఊహించామని చెప్పుకొచ్చారు.

“తెలంగాణాలో బీజేపీ వీక్ అయినా ఇదివరకటి సర్వేలలో 15-20% మోడీ ప్రధాని కావాలని కోరుకునేవారు. ఈ మధ్య నిర్వహించిన సర్వేలలో అది 5% కు పడిపోయింది. మోడీ గ్రాఫ్ తొందరగా పడిపోతుంది.” అని కవిత చెప్పుకొచ్చారు. అదే సమయంలో 2019లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా తెరాస మద్దత్తు లేకుండా కుదరదని చెప్పారు.

మరోవైపు నిన్నటి బడ్జెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా…ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ…బయ్యారంలో ఉక్కు కర్మాగారం…ఐఐఎం… ఎయిమ్స్‌….పసుపు బోర్డు…ఇవిగాక మరిన్ని వరాలివ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టుగానీ, మంజూరు గానీ రాష్ట్రానికి దక్కకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి లోనయింది.