Kalavakuntla Kavitha won MLC electionsనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది.

అయితే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ విజయంతో పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయిన కవిత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే ఈ విజయం రానున్న దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో పార్టీకి సరైన బూస్టు అంటూ గులాబీ సేన ఉత్సాహంగా ఉంది.

నిజామాబాద్ లో పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ర్యాలీలు తీశారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక గాలి వీస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల మాదిరి బీజేపీ హవా ఉండవచ్చని కొందరు జోస్యం చెప్పారు. అయితే దుబ్బాకలోనూ… జీహెచ్ఎంసిలోనూ నిజామాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయి అని తెరాస శ్రేణులు అంటున్నాయి.

అయితే నిజామాబాద్ ప్రభుత్వానికి అనుకూలం అనుకోకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు గా స్థానిక సర్పంచులు, వార్డు మెంబర్లు, మునిసిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉంటారు. 2014, 2018లో విజయాలతో వీటిలో తెరాస హవానే ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి వారు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉండదు. అయితే ఇదే ప్రజామోదం అని అనుకుని గులాబీ శ్రేణులు అతివిశ్వాసంగా ఉండకూడదు.