Kalavakuntla Kavitha political careerగత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అది కూడా ఒక బీజేపీ అభ్యర్థి చేతిలో. అప్పటి నుండి కేసీఆర్ ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఏం చేస్తారు అనే దాని మీద ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. మొన్న ఆ మధ్య ఆమె నిజామాబాద్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు అయితే కరోనా కారణంగా ఆ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.

తాజాగా ఆమె దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పోరాటాల నేప‌థ్యం నుండి వ‌చ్చి ఎమ్మెల్యేగా ఉన్న రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. అసెంబ్లీ గెజిట్ కూడా విడుద‌ల చేసింది. దీంతో 6 నెలల్లోపు ఆ స్థానంలో ఉప ఎన్నిక‌ల నిర్వ‌హించాల్సి ఉంది.

రామ‌లింగారెడ్డి కుటుంబంతో కేసీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉండ‌టంతో రామ‌లింగారెడ్డి కొడుకు స‌తీష్ రెడ్డికి అవ‌కాశం ఉంటుంద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతుంది. స‌తీష్ గ‌త పంచాయితీ ఎన్నిక‌ల్లో అంతా తానే అయి వ్య‌వ‌హ‌రించాడు. దీంతో దుబ్బాక సీటు ఆయ‌న‌కేన‌ని రామ‌లింగారెడ్డి వ‌ర్గీయులు భావిస్తున్న త‌రుణంలో ఈ వార్త వారిని కలవరపరుస్తోంది.

అయితే కవిత ఎమ్మెల్సీగా మారే అవకాశం ఉన్నందున ఈ సమయంలో సంప్రదాయానికి విరుద్ధంగా కేసీఆర్ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కాకుండా సొంత వారికీ సీటు ఇస్తారా అనేది అనుమానమే. ఈ ఉపఎన్నికలో దివంగత ఎమ్మెల్యే కుటుంబానికి సీటిస్తే ప్రతిపక్షాలు పోటీ చేసే అవకాశం ఉండదు. కవిత పోటీ చేస్తే పోటీ ఉండవచ్చు.