kalavakuntla-kavitha_Delhi_liquor-Scam_Supreme_Courtతెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం అంటే రాచకుటుంబం కిందే లెక్క. వారి కంటి చూపే ఓ ఆజ్ఞ… వారి మాటే ఓ శాసనంగా చలామణి అవుతుంది. కనుక కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు రమ్మనమని పిలవడమంటే మహాపచారమే అన్నట్లు బిఆర్ఎస్ మంత్రులు, నేతలు వాదిస్తున్నారు. ఆమెని విచారణకు రమ్మనమని పిలిచి ఈడీ తన పరిధిని అతిక్రమించిందని ఓ మంత్రి అన్నారంటే తెలంగాణలో ఆమె స్థాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు.

ఆమె మార్చి 11న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరవుతుంటే అనేకమంది తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు ఆమెకు అండగా వెంట ఉన్నారు. ఇంత శక్తివంతురాలైన కల్వకుంట్ల కవితకు నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు సుప్రీంకోర్టులో తిరస్కరణ ఎదురవడం విశేషం.

మహిళలను వారి ఇళ్ళలోనే ప్రశ్నించాల్సి ఉన్నప్పటికీ ఈడీ అధికారులు విచారణ పేరుతో తనను ఢిల్లీకి పిలిపించుకొని తమ కార్యాలయంలో ఒంటరిగా రాత్రి 8.30 వరకు ప్రశ్నిస్తున్నారని, తన ఫోన్‌ కూడా స్వాధీనం చేసుకొన్నారని కనుక ఈ విచారణని నిలిపివేయవలసిందిగా కోరుతూ, ఆమె మార్చి 15వ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసి, దానిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. కానీ ఆమె అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించి ఈనెల 24వ తేదీన చేపడతామని చెప్పింది.

కనుక మార్చి 16న ఆమె ఈడీ విచారణకు హాజరుకావలసి ఉంది. ఒకవేళ వెళ్ళి ఉండి ఉంటే ఈడీ ఆమెని తప్పక అరెస్ట్ చేసి ఉండేదని సిఎం కేసీఆర్‌తో సహా అందరూ గట్టిగా నమ్ముతున్నారు. బహుశః అందుకే కల్వకుంట్ల కవిత తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి విచారణకు వెళ్ళకుండా తప్పించుకొన్నట్లున్నారు.

అప్పుడు ఈడీ వెంటనే మరో నోటీసు జారీ చేసి ఈనెల 20న విచారణకు హాజరుకావలని ఆదేశించింది. మరోసారి విచారణకు హాజరయినా కాకపోయినా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కనుక ఆమె తరపు న్యాయవాదులు మళ్ళీ ఇవాళ్ళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ని కలిసి కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై నేడు అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్ధించారు. కానీ ఆయన మళ్ళీ తిరస్కరించారు. కనుక ఈ నెల 20న ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత హాజరుకాక తప్పదు. బహుశః అరెస్ట్ కాక తప్పదేమో?