Kalanikethan MD leela kumar arrestదక్షిణాదిలో ప్రముఖ వస్త్రాభరణాలుగా ఆదరణ పొందిన ‘కళానికేతన్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లీలా కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుల వద్ద 9 కోట్ల రూపాయల విలువ చేసే పట్టుచీరలు కొన్న కళానికేతన్ యాజమాన్యం… డబ్బు చెల్లించడంలో మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత కార్మికులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ డైరెక్టర్ గా ఉన్న సంస్థ ఎండీ సతీమణి లక్ష్మీ శారదను ఇటీవలే అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆమె అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా సోమవారం రాత్రి మరోమారు హైదరాబాద్ లో రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు లీలా కుమార్ ను కూడా అదుపులోకి తీసుకుని, అనంతపురానికి తరలించారు. నేడు లీలాకుమార్ ను కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నట్లు సమాచారం.

అయితే విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ఒక్క ధర్మవరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ‘కళానికేతన్’ పెద్ద ఎత్తున పట్టు చీరలను కొనుగోలు చేసిందట. ధర్మవరంలో మాదిరిగానే రాష్ట్రంలోని ఏ ఒక్క చేనేత కార్మికుడికి కూడా ఆ సంస్థ బకాయిలు చెల్లించలేదట. ఈ మొత్తం బకాయిలు 65 కోట్లకు పైగానే ఉన్నట్లు పోలీసులు నిగ్గుతేల్చారు.