Kajal-Aggarwal-at-Wimbledon 2017టెన్నిస్ అభిమానులకు మరో మధురమైన మ్యాచ్ ఈ ఆదివారం నాడు సాయంత్రం కన్నులవిందు చేయనుంది. ఆల్ టైం ఫేవరేట్ 3వ నెంబర్ సీడ్ రోజర్ ఫెదరర్ మరియు 7వ నెంబర్ సీడ్ మరిన్ సిలిక్ నడుమ జరగనున్న ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు కోట్లాది అభిమానులు టీవీల ముందు కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగ్వరాల్ మాత్రం ఈ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వింబుల్డన్ చేరుకుంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెడ్ గౌన్ వేసుకుని మెరిసిపోతున్న ఈ ‘చందమామ’ టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులోనూ వింబుల్డన్ కున్న చరిత్ర అమోఘమని, సాధారణంగా ఖాళీ సమయం దొరకదని, కానీ ఇక్కడ కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని వచ్చానని, అయితే వింబుల్డన్ కు రావడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ సందర్భంగా సదరు యాంకర్ వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తన అందచందాలను ప్రదర్శించింది ముద్దుగుమ్మ.

ఫెదరర్ – నాదల్ లలో ఫెదరర్ అంటే తనకు ఇష్టమని, సెరెనా – వీనస్ లలో సెరెనాకే తాను ఓటు వేస్తానని తెలిపిన కాజల్, క్రికెట్ – టెన్నిస్ లలో మాత్రం మొదటి ప్రాధాన్యత క్రికెట్ కే ఇస్తానని, వింబుల్డన్ లో ఉన్నప్పటికీ, తాను హానెస్ట్ గా చెప్పాలి కాబట్టి క్రికెట్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, కానీ టెన్నిస్ కూడా ప్రేమిస్తానని, ముంబై – లండన్ లలో ముంబై అంటే ఇష్టమని తెలిపింది. ఇక సచిన్ టెండూల్కర్ – లియాండర్ పేస్ లలో తామందరికీ క్రికెట్ గాడ్ అయిన సచిన్ కే తన ఓటని చిరునవ్వులు చిందిస్తూ తన భావాలను పంచుకుంది.