Kaitlapur_fly_over_Opening_by_KTR.jpgపాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల, చిత్తశుద్ది ఉన్నట్లయితే ఆ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలంటే పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం కనిపిస్తోంది. అటువంటి తాపత్రయం లేకపోతే రాష్ట్రం ఏవిదంగా ఉంటుందో తెలుసుకొనేందుకు మన ఆంధ్రప్రదేశ్‌ మన కళ్లెదుటే ఉంది.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మునిసిపల్, ఐటి, పరిశ్రమల శాఖలను ఒంటి చేత్తో అవలీలగా, అత్యంత సమర్ధంగా నిర్వహిస్తున్నారు. ఆ మూడు శాఖలను వేర్వేరుగా పరిశీలిస్తే ఆయన పనితీరు, సమర్ధత అర్ధం అవుతుంది.

ఐటి పరిశ్రమల శాఖల మంత్రిగా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి లక్షల కోట్లు పెట్టుబడులు సాధించారు. వందాలది ఐటి కంపెనీలను, పరిశ్రమలను రప్పించారు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలలో నియమనిబందనలను, లోపాలను సరిచేసి నూతన విధానాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున అనేక ప్రోత్సాహాకాలు అందించారు. దీంతో తెలంగాణకు ఐటి కంపెనీలు, పరిశ్రమలు క్యూ కడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి కంపెనీలను వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి ప్రాంతాలకు విస్తరించేలా చేసి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు లభించేలా చేస్తున్నారు.

పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల వరకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎక్కడికక్కడ రోడ్లు, ఫ్లైఓవర్లు, పచ్చదనంతో కళకళలాడే పార్కులు, చెరువులను సుందరీకరణ చేసి వాటిలో మ్యూజికల్ ఫౌంటెయిన్లు, చెరువులపై ప్రత్యేక ఆకర్షణగా కేబిల్ బ్రిడ్జిలు నిర్మింపజేశారు. ఏకీకృత కూరగాయల మార్కెట్లు, పార్కుల కంటే పరిశుభ్రమైన వైకుంటధామాలు (శ్మశానవాటికలు) వగైరాలు ఎన్నెన్నో ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇవాళ్ళ హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వద్ద కైతలాపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఈ 8 ఏళ్లలో మొత్తం 30 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మించాము. మరో 17 ఫ్లైఓవర్లు వివిద దశలలో ఉన్నాయి,” అని చెప్పారు.

ఒక్క మంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి చూపగలుగుతున్నప్పుడు, మన వైసీపీ ప్రభుత్వంలో సిఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మొత్తం 26 మంది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరింకెంత అభివృద్ధి కావాలి? కానీ ఎందుకు అభివృద్ధి జరగడం లేదు? రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను తేలేకపోయినా కనీసం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఎందుకు నిర్మించలేకపోతున్నారు?అంటే ముందు చెప్పుకొన్నట్లుగా పాలకులకు ఎంతసేపు వచ్చే ఎన్నికల గురించే ఆలోచనలే తప్ప అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళ కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల లేకపోవడం వలననేనేమో?