YSSharmila_YSR_Telangana_Partyతెలంగాణలో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల మొన్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ పాలన మీద, రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బహిరంగసభలలో మాటల గారడీ, బడ్జెట్‌లో అంకెల గారడీ చేస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఊహించినట్లే బిఆర్ఎస్‌ వైపు నుంచి వెంటనే ఘాటుగా సమాధానం వచ్చింది. మాజీ ఉపముఖ్యమంత్రి, బిఆర్ఎస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆమెకి జవాబు చెప్పారు. అయితే ఆయన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పాలన గురించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నిన్న జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, “అమ్మా షర్మిలా… సమైక్యాంద్రా అంటూ తెలంగాణలో పాదయాత్రలు చేసినదానివి. నీకు మా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ గురించి ఎందుకు?నీకు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా వెంటనే ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళి పాదయాత్రలు చేసుకో. ఎందుకంటే అక్కడ మీ అన్న జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది. అక్రమస్తుల కేసులోనో లేదా వివేకానంద రెడ్డి హత్య కేసులోనో ఆయన ఎప్పుడైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కనుక నీకు ఆంద్రాలోనే మంచి రాజకీయ అవకాశం ఉంది. నువ్వు అనవసరంగా నీ శక్తిని, శ్రమని, సమయాన్ని, వనరులని ఇక్కడ వృధా చేసుకొని నష్టపోకు.

ఈ పాదయాత్రలు ఏవో ఆంద్రాలో చేసుకొని అక్కడి ప్రజలకి నీ గోడు మొరపెట్టుకుంటే వాళ్ళు కరుణించి మీ అన్న స్థానంలో నీకు అవకాశం ఇవ్వొచ్చు. కనుక ఇక్కడ తెలంగాణలో పాదయాత్రలు కట్టిబెట్టి వెంటనే ఆంధ్రాకి వెళ్ళి పాదయాత్రలు చేసుకో. ఇక్కడ నువ్వు ఇంకా ఎన్నేళ్ళు పాదయాత్రలు చేసినా కాళ్ళనొప్పి తప్ప మరే ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని కాదని నీకు ఓట్లు వేస్తారని కలలు కంటూ విలువైన సమయం వృధా చేసుకోకు,” అని హితవు కడియం శ్రీహరి పలికారు.