KA - Paul contestibg for lok sabhaరాజకీయాలను కామెడీగా మార్చేసి రోజు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణల మీద తొడగొడుతున్న కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడ నుండి అనేది మాత్రం ఆయన స్పష్టం చెయ్యలేదు. తణుకులో పాస్టర్ల సదస్సులో కేఏ పాల్ పాల్గొని మాట్లాడారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ఒక్క అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాను చేస్తానని చెప్పారు. మోదీ, చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తెలిపారు. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. మార్చి 20లోపు మొదటి లిస్ట్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ప్రజాశాంతి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. ఆ గుర్తు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఫ్యాన్ గుర్తుకు దగ్గరగా ఉండటంతో కొంచెం క్రాస్ ఓటింగు జరిగే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవుల సపోర్టు ఇప్పటిదాకా ప్రతిపక్ష పార్టీ ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత ప్రభోధకుడైన పాల్ గనుక అన్ని సీట్లలోనూ పోటీ చేస్తే కొంత మేర ఆ వర్గాలలో జగన్ పార్టీ ఓట్లు చీలిపోవచ్చు. అయితే 2014 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే పోటీ చేయబోతున్నాం చేస్తున్నాం అంటూ హడావిడి చేసిన పాల్ చివరి నిముషంలో తన అభ్యర్థుల లిస్టు ఉన్న సిడీని ఎవరో కొట్టేశారు అంటూ మాయం అయిపోయారు. చూడాలి ఈ సారి ఆయన ఏం చేస్తారో?