K Vishwanath Gets Dadasaheb Phalke awardఇండస్ట్రీలో అవార్డులు ఎలా దక్కుతాయో అనే విషయంపై రకరకాల అభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది పేర్లు ప్రకటించినపుడు మాత్రం, అవార్డులకే వన్నె తెచ్చే అనుభూతి కలగడం సహజం. అలాంటి అనుభూతే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ వర్గీయులు మరియు సినీ అభిమానులు అనుభవిస్తున్నారు. అవార్డు అన్న పదానికి తెలుగు ఇండస్ట్రీలో అర్హత పొందిన తొలి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే… అది కె.విశ్వనాథ్ అన్న పేరే వినిపిస్తుంది.

అయితే ఇప్పటివరకు పెద్దగా పలకరించని అవార్డు, తాజాగా 2016 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటన రావడంతో పరిశ్రమ వర్గీయులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన ఈ ప్రకటన అవార్డులపై ఒకరో, ఇద్దరికో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేదిగా ఉందని చెప్పవచ్చు. మే 3వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నట్లు, ఈ సందర్భంగా విశ్వనాథ్ కు అభినందనలు తెలిపారు వెంకయ్య నాయుడు.

విశ్వనాథ్ తీసిన ప్రతి చిత్రం కళాఖండంగా నిలబడడమే ఆయనపై ప్రతి ఒక్కరికి గౌరవభావాన్ని పెంచింది. అందుకే ఈ కళామ్మ తల్లి ముద్దుబిడ్డకు పురస్కార ప్రకటన రాగానే… ప్రస్తుత తరానికి సంబంధించిన సోషల్ మీడియా కూడా అభినందనలతో హోరేత్తిస్తోంది. ఇది కళాతపస్వికి అందిన పురస్కారం అని చెప్పే కంటే, తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన అరుదైన గుర్తింపు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే… విశ్వనాథ్ కన్నా ఎక్కువగా తెలుగు సినీ కళామ్మ తల్లికి మరెవరూ సేవ చేయలేదని చెప్పాలి.

సప్తపది, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం… ఇలా ప్రతి చిత్రమూ ఓ చరిత్రలో నిలిచిపోయినదే. ఈ అవార్డు ప్రకటనపై టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వ‌నాథ్‌కు ఈ అవార్డు రావ‌డం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కే గ‌ర్వ‌కార‌ణమ‌ని, ఇది తెలుగు సినిమా రంగానికి ఇచ్చిన గౌర‌వమ‌ని సినీ న‌టుడు, ఎంపీ ముర‌ళీ మోహ‌న్, మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ అన్నారు. ఈ అవార్డు అందుకోవ‌డానికి విశ్వ‌నాథ్ 100 శాతం అర్హుడని, తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ఎన్నో మ‌ర‌చిపోలేని సినిమాల‌ను అందించార‌ని ప్ర‌శంసించారు.