k Jawahar Reddy High Court Issueగతంలో అక్రమాస్తుల కేసులలో పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టులు చుట్టూ తిరిగారు. జైళ్ళకు కూడా వెళ్ళి వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు తరచూ అదే దుస్థితి ఎదురవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ఆరు నెలల్లో సుమారు 10 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో మొట్టికాయలు పడి తలబొప్పి కట్టింది. తాజాగా సిఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.జవహార్ రెడ్డికి హైకోర్టులో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి.

నిన్న హైకోర్టులో జరిగిన ఓ కేసు విచారణకు ఆయన హాజరుకావలసి ఉంది. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జవహార్ రెడ్డి ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఓ అఫిడవిట్ పంపిస్తే సరిపోతుందని జవహార్ రెడ్డి భావించినట్లున్నారు. ఆయన ఎన్ని గంటలు సమావేశంలో పాల్గొన్నారో, విచారణకు హాజరుకాకుండా ఎక్కడ ఉన్నారో మమ్మల్నే కనుగొనమంటే మాకేమి అభ్యంతరం లేదు. కోర్టు విచారణలు అంటే ఇంత అలుసా? మాకేమీ పనిపాటు లేకనే కేసులు విచారిస్తున్నామా?విచారణకు హాజరుకాకపోయినా ఏమీ కాదులే… అని అనుకొంటే ఈసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి మరీ కోర్టుకు రప్పిస్తాము. కనుక పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నాము. ఎప్పుడు విచారణ జరిగినా కేసుకు సంబందిత వ్యక్తులందరూ తప్పనిసరిగా హాజరుకావలసిందే,” అని న్యాయమూర్తి తీవ్రంగా హెచ్చరించారు.