K-Chandrashekar-Rao Election Stuntతెలంగాణ వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ సొంతం. తెలంగాణ ఆవిర్భావ ముఖ్య ఉద్దేశమే నీళ్లు – నియామకాలు. ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయాన్ని బలంగా తెలంగాణ ప్రజల మనసులలో నింపి.., తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదంతో ముందుకెళ్లి ఎన్నికలలో రెండు సార్లు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు గడుస్తున్నా… రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నా, ఏమీ పట్టనట్టుగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా నిరుద్యోగులపై వరాలు జల్లు గుప్పించారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడుతూ… 91 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని, ఇక నుండి తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో నియామకాలు ఉండవని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఇదంతా ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. 2023లో జరగాల్సిన ఎన్నికలు మరింత ముందుకు వస్తాయని మీడియా వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాలకు కేసీఆర్ కు నిరుద్యోగులపై ప్రేమ పొంగుతోందా? అని ప్రశ్నిస్తున్నాయి.

అంతేగాక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల రంగంలోకి దిగడం – ఆ వెనువెంటనే కేసీఆర్ నుండి ఈ వరాల జల్లు రావడం అనేది, తదుపరి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకోవడమే అన్న టాక్ పొలిటికల్ వర్గాలలో బలపడుతోంది. ఇవన్నీ కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం కాకుండా, వీటిని ఆచరణలో పెడితే, నిరుద్యోగుల పంట పండినట్లే భావించవచ్చు. అలాగే ఎంతోకాలంగా కాంట్రాక్టు పేరుతో నలుగుతోన్న ఉద్యోగులకు కూడా మోక్షం లభించినట్లే!