K-Chandrashekar_Rao_Draupadi_Murmu_Yaswant_Sinhaతెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టాలని ప్రయత్నించిన ప్రతీసారి దేశంలో ఏదో ఓ అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతుండటం దాంతో ఆయన తాత్కాలికంగా ఆ ఆలోచనను విరమించుకోవడం జరుగుతోంది. ఈసారి భారత్‌ రాష్ట్ర సమితి పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతుండగా దేశంలో మళ్ళీ అనూహ్య పరిణమాలు జరుగుతున్నాయి.

ముందుగా రాష్ట్రపతి ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షగా మారాయి. ఆయన కోరుకొన్నట్లుగానే దేశంలో విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టేందుకు ఢిల్లీలో సమావేశం కాగా, మమతా బెనర్జీ దానికి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించడంతో, సిఎం కేసీఆర్‌ ఆ సమావేశానికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది.

ఇప్పుడు విపక్షాలు యశ్వంత్ సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించాయి. కానీ ఇప్పుడు కూడా సిఎం కేసీఆర్‌ ఆయనకు మద్దతు ప్రకటించలేని పరిస్థితిని కల్పించింది బిజెపి. తొలిసారిగా ఓ ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముని ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటించడంతో, ఆమెను కాదని యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్‌ మద్దతు ఇవ్వలేని పరిస్థితి కల్పించింది. ఒకవేళ యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్‌ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించినట్లవుతుంది.

అలాగని ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపితే బిజెపికి సహకరించినట్లవుతుంది. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలకు టిఆర్ఎస్‌ దూరంగా ఉండదలిస్తే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఆదివాసీ మహిళను ఎంపిక చేస్తుంటే టిఆర్ఎస్‌ అందుకు వ్యతిరేకం అనే తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. పైగా కాబోయే రాష్ట్రపతితో సత్సంబంధాలు ఏర్పరచుకొనేందుకు వచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని చేజేతులా వదులుకొన్నట్లు అవుతుంది కూడా. ఇదీగాక రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండిపోతే అటు విపక్షాలను కూడా చేజేతులా దూరం చేసుకొన్నట్లవుతుంది.

కనుక రాష్ట్రపతి ఎన్నికలు సిఎం కేసీఆర్‌కు ఓ అగ్నిపరీక్షగా మారాయని చెప్పవచ్చు. మరి ఈ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ ఏ గట్టున ఉంటారో చూడాలి.