YSRCP on a verge of a wipeout in Godavari districtsతూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే కీలక నేత అయిన జ్యోతుల నెహ్రూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార సరళితో పొసగలేక టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కేసిన సందర్భంగా తన మాజీ పార్టీపై, ఆ పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “వైసీపీలో అంతా ఏక నాయకత్వం, ఏక ఆలోచన ఉన్నాయని, ఇంకా వైసీపీలోనే కొనసాగితే, రాష్ట్ర ప్రజలకు నష్టం చేసినవాడిని అవుతాననే తన స్వగృహామైన టీడీపీలోకి వచ్చేశానని” పేర్కొన్నారు.

“తాను చెప్పిందే వేదమనుకునే నాయకుడు… తాను తప్ప అందరూ ‘జీరో’ అనుకునే పార్టీ నాయకుడి వద్ద ఎంతకాలం కష్టపడి పనిచేసినా పార్టీ అభివృద్ధి చెందదని” తీవ్రవిమర్శలు చేసారు. రాష్ట్రానికి బలమైన ప్రతిపక్షం కావాల్సిన సమయంలో వైసీపీలో ‘వన్ మ్యాన్ రూల్’ నడుస్తోందని, అసెంబ్లీలో ఉప నాయకుడిగా ఉన్నా ఉపయోగం లేదని, తానూ చెప్పిన మాటలకు ఎన్నడూ విలువ ఇవ్వకుండా దూరం పెట్టారని చెప్పిన జ్యోతుల నెహ్రూ, ఇక వైసీపీ పరిణతి చెందదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జ్యోతుల ఎంట్రీతో తెలుగుదేశం పార్టీ వర్గాలతో సహా సిఎం చంద్రబాబులో కూడా నూతన ఉత్సాహం ఉరకలేసింది. పార్టీలో చేరిన తర్వాత పాములేరు చెక్ డ్యాం ఆవశ్యకత గురించి వివరించిన జ్యోతుల నెహ్రూ ప్రతిపాదనకు సిఎం వెంటనే ఆమోద ముద్ర వేసారు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించాలని మంత్రి దేవినేని ఉమా వైపు చూపిన చంద్రబాబు, కేంద్రం అనుమతులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను కట్టి తీరుతామని హామీ ఇచ్చారు.