Jagan initiates talks with Jyothula Nehruరాజకీయాల్లో ‘అందలం’ ఎక్కాలి, అంతకంతకూ అత్యున్నత పదవులు అలంకరించాలి అన్న కోరికలు ఉండడం సహజమే. సగటు రాజకీయ నేతకు ఉండే లక్ష్యాలు ఇవే. అయితే ఈ నెల 11వ తేదీన వైసీపీ నుండి టిడిపిలోకి రాబోతున్న జ్యోతుల నెహ్రూ మాత్రం ఓ అరుదైన కోరికను మీడియా వేదికగా వ్యక్తపరిచారు. అయితే కాలం కలిసి వస్తే… జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి అవుతారేమో గానీ, ఆయన కోరిక మాత్రం నెరవేరే అవకాశం లేదని రాజకీయ వర్గాలు ఖరాఖండిగా చెప్తున్నాయి.

జ్యోతుల నెహ్రూ వ్యక్తపరిచిన అభిప్రాయాలను విన్న తర్వాత ఒక్క పొలిటికల్ వర్గాలేంటి… ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ఒక చిన్న పిల్ల వాడైనా ఆయన అభిలాష నేరేవేరేది కాదని చెప్తారు. ఓ మీడియా ఛానల్ లో జ్యోతుల నెహ్రూ వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్లుప్తంగా పరిశీలిస్తే…

“నేను పార్టీ మారిన తర్వాతైనా వైసీపీ అధినేత జగన్ లో మార్పు వస్తుందని భావిస్తున్నానని” ఎవరి ఊహలకందని విషయాన్ని ప్రస్తావించిన జ్యోతుల నెహ్రూ రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ పరిణితి చెందలేదని విమర్శించారు. పార్టీ అభ్యున్నతి కోసం అన్నీ దిగమింగుకుని పనిచేశానని, అయితే ఆ పార్టీలో సమష్టి ఆలోచనలు, నాయకత్వం లేవని, పీఏసీ పదవి కోసం తానెప్పుడూ ఆశపడలేదని, అయితే ఆ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధపెట్టాయని జ్యోతుల నెహ్రూ తన మనోవేదనను వెళ్లగక్కారు.

ఇప్పటికే వైసీపీ నుండి చాలా మంది వెళ్ళిపోయారు. అలాగే వైసీపీ పుట్టిన నాటి నుండి జగన్ చెంతన ఉన్న వారు కూడా ఎన్నికలకు ముందు జగన్ నుండి దూరంగా జరిగారు. అయినప్పటికీ జగన్ లో ఏ మార్పు రాకపోగా, అంతకంతకూ మరింత మొండిగా తయారవుతున్నారనేది చాలా సందర్భాలలో రాజకీయ వర్గాలు విశ్లేషణలు చేసాయి. మరి అలాంటి జగన్ లో తను ఒక్కడు తప్పుకుంటే… మార్పు వస్తుందనుకుంటే… అంత కంటే భ్రమ మరొకటి ఉండదని పొలిటికల్ వర్గాల మాటలు. జగన్ ను నిశితంగా పరిశీలిస్తున్న వారు కూడా ఈ వ్యాఖ్యలను కాదనలేకపోతున్నారు… మరి..!