Jyothula-Nehruటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ బుదవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో మండల కార్యకర్తలు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో టిడిపి ప్రభంజనం మొదలైంది. వచ్చే ఎన్నికలలో మనమే గెలిచి అధికారంలోకి రావడం ఖాయమే. అయితే జగన్ ప్రభుత్వం బలమైన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ప్రజలందరిపై నిఘా పెడుతూ సమాచారం సేకరిస్తోంది. కనుక వచ్చే ఎన్నికలలో వాలంటీర్లతో దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయవచ్చు. దీనిని అడ్డుకోవాలంటే టిడిపి సభ్యత్వం ఇంకా పెరగాలి. టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత చురుకుగా జరపాలి. వీలైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకొని ప్రతీ గ్రామంలో, పట్టణంలో, జిల్లాలో టిడిపి జెండాలు రెపరెపలాడాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు బత్తుల సత్తిబాబు, పాలూరి బోసుబాబు, సాలపు నలమహారాజు, కోలా ఏసుబాబు, పిట్ట అరుణ్, రాము తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం అర్బన్ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ అధ్వర్యంలో బుదవారం పట్టణంలో 1,2 వార్డులలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పార్టీ నేతలు షేక్ బాజీ, సబ్నీసు కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వలవల బాబ్జీ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజలకు బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న జగన్ ప్రభుత్వం మళ్ళీ వారిపై పన్నులు, ఛార్జీల భారం ఎందుకు మోపుతోంది? జగన్ పాలనలో సామాన్య ప్రజలు మనశాంతిగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ గాడిన పడదు,” అని అన్నారు.