తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలబోతోంది. ఆ పార్టీ ఎస్సీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ పార్టీని వీడటానికి సిద్ధం అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వైసీసీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. జూపూడి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో మీడియాలో ఆ పార్టీ వాణి బలంగా వినిపిస్తూ టీడీపీని తీవ్రంగా విమర్శించేవారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా ఆయన అనూహ్యంగా టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసిపి మీద, వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, సామాజిక నేపథ్యం దృష్ట్యా జూపూడి ప్రభాకర్ రావును పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

పార్టీని ఎన్నో ఏళ్లగా అంటిపెట్టుకుని ఉన్న నేతలను కాదని, అరువు నేతలను అందలం ఎక్కిస్తే ఏమవుతుంది అనేది చంద్రబాబుకు ఇప్పటికైనా అర్ధం కావాలని టీడీపీ అభిమానులే విమర్శిస్తున్నారు. మరోవైపు జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ కూడా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.

ఆయన ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూపూడి ప్రభాకర రావుతో పాటు ఆకుల సత్యనారాయణ వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైసిపిలో చేరే అవకాశం ఉంది. దీనితో పండగ పూటనే ప్రధాన పార్టీకి, మరో ప్రతిపక్ష పార్టీ జనసేనకు జగన్ షాక్ ఇచ్చినట్టు అవుతుంది.