Jupally Krishna Raoతెలంగాణలో ఇటీవలే జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలలో కారు జోరుగా దూసుకుపోతుంది. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన ప్రతిపక్షాలు నామమాత్రంగానే పోటీలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా కొల్లాపూర్‌ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడ తన సత్తా చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి హైకమాండ్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రస్తుతం కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గమే టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా పోటీచేశారు.

దీనితో మంత్రి తన పంతం నెగ్గించుకున్నట్టు అయ్యింది. రెండో సారి ఎన్నికైన తరువాత జూపల్లిని ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టారు. దీనితో ఆయన పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. తనకు కావాల్సిన వారికి టిక్కెట్లు కూడా నిరాకరించడంతో రెబెల్స్ ను రంగంలోకి దింపారు.

ఇప్పటికైనా తెరాసలో జూపల్లికి ప్రాధాన్యత పెరుగుతుందేమో చూడాలి. మరోవైపు ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేక పవనాలు రావడంతో పార్టీ నాయకులు, మంత్రులు, క్యాడర్ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా పని చేశారు. దానితో తిరుగులేని ఫలితాలు వచ్చాయి.