NTR-YSR-Same-Junior-NTR జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చగానే అందరూ జూ.ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి ఎలా స్పందిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పందించడానికి ఎన్టీఆర్‌ కొంత సమయం తీసుకొన్నప్పటికీ ఊహించినట్లే కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లు కొద్దిసేపటి క్రితం ఇటు జగనన్నకి అటు చంద్రన్నకి కోపం రాకుండా చాలా జాగ్రత్తగా చెప్పవలసిన రెండు ముక్కలూ ట్విట్టర్‌లో పెట్టేశారు.

ఇంతకీ జూ.ఎన్టీఆర్‌ ఏమన్నారంటే, “ఎన్టీఆర్‌, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాధారణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈరకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్‌ సంపాదించుకొన్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు,” అని ట్వీట్ చేశారు.

రాజకీయాల వలన జూ.ఎన్టీఆర్‌ రెండుసార్లు ఎదురుదెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. చనిపోయిన ఎన్టీఆర్‌నే జగన్ విడిచిపెట్టనప్పుడు, తన సినిమాలను విడిచిపెట్టరని జూ.ఎన్టీఆర్‌కి బాగా తెలుసు. ఆయనకే కాదు… జగన్ ముందు చేతులు జోడించి ప్రాధేయపడిన సినీ పెద్దలందరికీ అనుభవపూర్వకంగా అర్దమైంది. కనుకనే సినీ పరిశ్రమతో ఎన్టీఆర్‌కు దశాబ్ధాల అనుబందం ఉన్నప్పటికీ ఎవరూ నోరువిప్పలేకపోతున్నారు. జూ.ఎన్టీఆర్‌ ఇందుకు మినహాయింపు కాదు. కానీ దీనిపై స్పందించక తప్పని పరిస్థితి ఎదురైంది కనుకనే ఆచితూచి ఈవిదంగా స్పందించారు. అయితే దానిలో తన అభిప్రాయం చాలా స్పష్టంగానే చెప్పినట్లు అర్దమవుతోంది.

జూ.ఎన్టీఆర్‌ వంతు అయిపోయింది కనుక ఇక మిగిలింది లక్ష్మీ పార్వతే. మరి ఏమి చెప్తారో.. ఎలా చెప్తారో.. ఇంకా ఎప్పుడు చెప్తారో అసలు చెప్తారో లేదో చూడాలి.