Judgement-against-3-capitalsవైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్ళల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనను సూచించగా, దీనికి ప్రజల నుండి రాజకీయ విశ్లేషకుల వరకు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక అమరావతి కోసం భూములిచ్చిన రైతులైతే, ఏకంగా కోర్టు మెట్లు సైతం ఎక్కారు.

ఇలా 100కి పైగా దాఖలైన పిటిషన్లపై గతంలోనే జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. ఆ తర్వాత అరూప్ గోస్వామి విచారణ కొనసాగగా, వారు బదిలీ అయిన పిమ్మట గత రెండు రోజులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటం వలన దేశం మొత్తానికి స్వాతంత్య్రం లభించిందని, అలాగే అమరావతి రైతులు రాష్ట్ర రాజధానికి భూములిచ్చారని, ఆ విధంగా అమరావతి అంటే ఆ ప్రాంత రైతులకే కాదు, కర్నూల్, వైజాగ్ ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాజధాని అని ధర్మాసనం అభిప్రాయపడింది.

హైకోర్టు ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలోనే వీడిపోయే సంకేతాలు కనపడుతున్నట్లుగా పొలిటికల్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇంకా ముందుకెళ్లాలంటే ఏపీ సీఎం మరోదారి చూసుకోవాల్సిన పరిస్థితి అనివార్యం అవుతుందన్న టాక్ బలంగా వినపడుతోంది.