Jrntr Tweet Chandrababu naidu nara lokeshతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు తనయుడు నారా లోకేష్ లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా లోకేష్ విషయం బయటపడగా, నేడు చంద్రబాబు కూడా అదే బాటలో పయనించారు. దీంతో వీరిద్దరూ కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని, మెగాస్టార్ చిరంజీవి వరకు అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

లేటెస్ట్ గా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరారు. “మావయ్య చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా” జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. బహుశా ఎన్టీఆర్ వర్ధంతి రోజున జరిగిన ఓ మంచి పరిణామంగా తెలుగుదేశం వర్గాలు కొనియాడుతున్నాయి. తారక్ వేసిన ఒక్క ట్వీట్ టిడిపిలో నింపిన జోష్ వర్ణణాతీతం.

అయితే ఈ పరిణామాలు ప్రత్యర్థి పార్టీ వైసీపీ వర్గాలకు ఏ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. ఎందుకంటే చంద్రబాబుకు – జూనియర్ ఎన్టీఆర్ కు వైరం ఉందంటూ తమ మీడియాలలో ప్రసారం చేసుకుంటూ గత కొన్నేళ్లుగా రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నేపధ్యంలో… చంద్రబాబు, లోకేష్ లను ట్యాగ్ చేస్తూ తారక్ వేసిన ట్వీట్ ప్రత్యర్థుల గాలి తీసేసినట్లయ్యింది. అసలు ఒక్క చిన్న ట్వీట్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు దక్కిందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే!

జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు అయిన కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడం, ఆపై అసభ్య పదజాలాన్ని వినియోగిస్తూ చంద్రబాబును పదే పదే దూషించడంతో సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ కార్నర్ అయ్యారు. ఈ పర్యవసానంపై వెనువెంటనే స్పందించకపోయినా, కొంతకాలం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి తనకు – వైసీపీ నేత కొడాలి నాని చేసే వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని తారక్ వివరణ ఇచ్చుకున్నారు.

అలాగే తన కట్టే కాలే వరకు తాత గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని, ఇదే విషయం మళ్ళీ మళ్ళీ తనను అడగవద్దని, ప్రస్తుతం తన సినిమాలు తాను చేసుకుంటున్నానని మీడియా ముఖంగా చెప్పిన సంగతులు తెలిసినవే. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్, ప్రస్తుతం కూడా పొలిటిక్స్ కు బహు దూరంగా సినిమాలు చేసుకుంటున్నారు.

అయితే గడిచిన కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే… నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా పూర్తి సంతోషంతో ఉన్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి మీద వైసీపీ నేతలు చేసిన వికృత మాటలను తారక్ ఖండించడం, ‘అఖండ’ వేదిక మీద స్వయంగా బాలకృష్ణ ‘మా జూనియర్ ఎన్టీఆర్’ అంటూ స్పందించడం, అలాగే నేడు ఈ ‘మావయ్య’ ట్వీట్!

ఈ ఉత్సాహం ఎంతవరకు వెళ్లిందంటే… ఇటీవల జరిగిన “ఆర్ఆర్ఆర్” చిత్ర ప్రమోషన్స్ లో ‘సీఎం సీఎం’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకున్నారు. నందమూరి – నారా కుటుంబాల నడుమ ఏర్పడుతోన్న ఈ కదలికలు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ వర్గాలకు రుచించకపోవచ్చు గానీ, తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని అందించడంలో నూటికి నూరు శాతం విజయవంతం అవుతోంది.