NTR koratala sivaబహుశా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి స్ఫూర్తి పొందారో లేక తమ సత్తా కూడా చాటుదామని చేసిన ప్రయత్నమో గానీ… “జనతా గ్యారేజ్” మొదలైన దగ్గర నుండి ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమాన సందోహం ఆడిటోరియంలో దిక్కులు పిక్కటిల్లేలా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎవరూ ప్రసంగించని సందర్భంలో ఇలాంటి అరుపులు ఉత్సాహాన్ని ఇస్తాయోమో గానీ, ఆహ్వానితులు, చిత్ర బృందం మాట్లాడుతున్న సమయంలో ఇలా అరవడం అనేది ఒక రకంగా ప్రసంగించే వారిని అవమానించడమే అవుతుంది.

సహజంగా ఆడియో వేడుకల్లో ఈ రకమైన ప్రవర్తన పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కువగా కనపడుతుంటున్న విషయం తెలిసిందే. దీనిని నియత్రించాడనికే నాడు అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అంటూ గొంతు చించుకున్నది… అలాగే ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో మనసు విప్పింది. అయితే దాని పర్యవసానాలు కూడా అందరికీ తెలిసినవే అయినప్పటికీ… నిజానికి తమ అభిమానులకు సూచనలు, గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత సదరు హీరో పైనే ఎక్కువగా ఉంటుంది. ఆ పని పవన్ కళ్యాణ్ చేయకపోవడం వల్లనే… బన్నీ బలి కావాల్సిన పరిస్థితి నెలకొందని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కానీ, అలాంటి అవకాశాన్ని జూనియర్ ఎన్టీఆర్ వదిలిపెట్టలేదు. ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకలో దర్శకుడు కొరటాల శివ తన సినీ అనుభూతులను పంచుకుంటున్న సమయంలో ‘జై ఎన్టీఆర్… జై ఎన్టీఆర్…’ అంటూ పలకాల్సిందిగా కేకలు పెట్టడంతో… ఒకానొక స్థాయిలో మొక్కుబడి వ్యవహారంగా ‘అ… జై ఎన్టీఆర్… ఓకేనా…’ అంటూ కొరటాల అన్నారు. అయితే తర్వాత కూడా కొరటాల ప్రసంగానికి జూనియర్ అభిమానులు అడ్డు తగలడంతో… జూనియర్ ఎన్టీఆర్ కల్పించుకుని మైక్ పట్టుకుని అభిమానులకు విజ్ఞప్తి చేసారు.

‘మనకు సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కోసం ఆరు నెలల పాటు కష్టపడ్డాడు, మనం ఆ గౌరవం ఆయనకు ఇవ్వాలి, దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను… ఎందుకంటే ఈ సినిమాకు పడిన కష్టం మీ అందరికీ తెలియాలి… ఆ కష్టాన్ని మీ అందరితో పంచుకుంటే ఆయనకు ఆనందంగా ఉంటుంది, మనకు ఆనందంగా ఉంటుంది… థ్యాంక్యూ…’ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసాడు. దీని తర్వాత దాదాపు మరొక ఆరేడు నిముషాల వరకు కొరటాల ప్రసంగం సాగింది. ఎక్కడా కూడా అభిమానులు అడ్డు తగలకుండా జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తిని పాటించారు.

ఇది ఒక్క జూనియర్ ఎన్టీఆరే కాదు… అభిమానులను సరైన దిశలో మార్గనిర్దేశకాలు చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయా హీరోల పైనే ఉంటుంది. వారు నోరు తెరిచి ఒక్క మాట చెప్తే… నిజమైన అభిమానులు ఎప్పుడూ వాటిని అనుసరిస్తారు. ఉదాహరణకు తన కటౌట్ పై పాలాభిషేకం చేసిన వీడియోను, తన సినిమా కోసం ఒక మూగ జీవిని చంపిన వీడియోను తానూ చూసాను, అలాంటివి చేయవద్దు అంటూ కూడా జూనియర్ ఇచ్చిన పిలుపు హర్షణీయం.

జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విధానం బహుశా కొంత ఓవర్ గా లేక అసహజత్వంతో కూడుకుని ఉందన్న భావన వీక్షకులలో వ్యక్తం కావచ్చు కానీ, అభిమానులకు ఇచ్చిన సూచనలు, చెప్పిన నాలుగు మంచి మాటలు మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల విషయంలో చేయలేని పనిని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చేసి చూపించడం ఇండస్ట్రీ జనాలకు శుభసూచకం. ఒకవేళ ఏ ఇతర అభిమానులైనా ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే… వారిని దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తమ లాంటి హీరోలపైనే ఉందని జూనియర్ చెప్పకనే చెప్పాడు.