Jr NTR USA overseas Collections‘టెంపర్’ సినిమా నుండి సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ సరికొత్తగా కనపడుతున్నారు. ఒక సినిమాకు, మరో సినిమాకు సంబంధం లేకుండా వినూత్నమైన క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు, అంతకు ముందువరకు ఏ మార్కెట్ లో అయితే తను ఎక్కడైతే వీక్ అని భావించారో, ఇప్పుడు అదే మార్కెట్ లో తన హవాను కొనసాగిస్తూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. అవును… తారక్ కు ‘బి, సి’ సెంటర్లలో ఉన్న పట్టు, ఎ సెంటర్లలో లేదనేది వాస్తవం.

అయితే ఇది ఒకప్పుడు మాట. ప్రస్తుతం ‘ఎ’ సెంటర్లలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన స్టామినాను నిరూపించుకుంటున్నారు అనడానికి నిదర్శనమే యుఎస్ మార్కెట్. క్లాస్ సినిమాలకు పట్టం కట్టినంతగా మాస్ సినిమాలను యుఎస్ ప్రేక్షకులు ఆదరించరన్న విషయం బహిరంగమే. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వరుసగా నాలుగు సినిమాలు యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయగా, చివరి మూడు సినిమాలు అయితే ఏకంగా 1.5 మిలియన్ మార్క్ ను దాటి సరికొత్త చరిత్రను సృష్టించాడు.

అవును… వరుసగా “నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ” చిత్రాలతో యుఎస్ మార్కెట్ లో 1.5 మిలియన్ అందుకున్న మొదటి దక్షిణాది హీరోగా తారక్ సరికొత్త రికార్డులకు వేదిక అయ్యాడు. ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న ‘జై లవకుశ’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, 1.5 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. ఇదే మార్కెట్ లో ‘కింగ్’గా భావించే మహేష్ బాబు “స్పైడర్”కు కూడా డివైడ్ టాక్ రాగా, ఆ సినిమా మూడు రోజులు గడిచినా ఆ మార్క్ ను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే.

ఇక ‘జై లవకుశ’ విషయానికి వచ్చేపాటికి 1.5 మిలియన్ కు చేరుకున్నా, నష్టాలు అయితే తప్పడం లేదు. ఈ వారంతో ఇక క్లోజింగ్ దశకు చేరుకున్న ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలన్నా కనీసం 1.9 మిలియన్ కు ఖచ్చితంగా చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో లాభాల మాట పక్కన పెడితే, తక్కువ నష్టాలతో “జై లవకుశ” బయట పడుతున్నట్లే భావించవచ్చు. అయితే యుఎస్ లో తనకంటూ మినిమమ్ మార్కెట్ ను ఏర్పరచుకుని, యుఎస్ లో తారక్ “నయా కింగ్”గా అవతరించే సంకేతాలు కనపడుతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.