JrNTR_Upcoming_Moviesసోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి నాలుగేళ్లు దాటేసింది. వచ్చే ఏడాది కొరటాల శివది రిలీజయ్యేనాటికి అయిదో యానివర్సరీ దగ్గరగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ అయినా అది మల్టీస్టారర్ కావడం వల్ల రామ్ చరణ్ తో క్రెడిట్ ని సమానంగా పంచుకోవడంతో ఫ్యాన్స్ తారక్ ఒక్కడినే తెరమీద చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. అయితే విపరీతమైన జాప్యం ఇప్పటికే పది నెలలను కరిగించేసింది. రాబోయే మార్చి 22న ట్రిపులార్ రెండో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. సో వాళ్ళ ఘోష న్యాయమైనదే. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న స్టార్ కి ఇలా జరిగితే ఫీలవుతారుగా.

సరే ఆలస్యం అయితే అయ్యింది బెస్ట్ కావాలన్నప్పుడు ఎదురుచూపులు తప్పవు. జూనియర్ చెబుతోంది అదే. అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సందర్భం కాకపోయినా యాంకర్ సుమ హఠాత్తుగా తెచ్చిన ప్రస్తావన వల్ల ఎన్టీఆర్ 30 అప్డేట్ ని స్టేజి మీదే ఇచ్చేశాడు. మార్చి 20 లోపు షూటింగ్ మొదలుపెడతామని శుభవార్తలు ఏవైనా భార్యకన్నా ముందు మీకే చెబుతానని కుండబద్దలు కొట్టాడు. సరే ఎవరివల్ల అయితేనేం మొత్తానికి పబ్లిక్ వేదిక మీద మొదటిసారి తారక్ కొరటాల మూవీ గురించి చెప్పాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ వెయిటింగ్ లో ఉన్నాడు. కెజిఎఫ్, సలార్ తర్వాత మూవీ కాబట్టి ప్రకటనకే అంచనాలు ఎక్కడికో వెళ్లాయి

ఇవి చాలవన్నట్టు తాజాగా వెట్రిమారన్ పేరు తెరమీదకొచ్చింది. జూనియర్ తో ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్త ట్విట్టర్ ని ఊపేసింది. ఇది కూడా ఓకే అయితే లేట్ అవుతున్నా సరే యంగ్ టైగర్ చేతిలో బెస్ట్ లైనప్ ఉన్నట్టే. అయితే ప్లానింగ్ విషయంలో మాత్రం ఇకపై పకడ్బందీగా ఉండాలి. దీనికి ప్రభాస్ సూత్రం ఫాలో అయితే బెటర్. ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ మీద పెట్టి మరొకటి ప్రొడక్షన్ లో ఉంచేసి వీలైనంత బిజీగా షూటింగులతో గడిపేస్తున్నాడు. రిలీజులు ఎప్పుడు ఉన్నా సరే ముందైతే వాటిని పూర్తి చేస్తే గ్యాప్ రాదు.

జూనియర్ ఎన్టీఆర్ ఈ కోణంలో ఆలోచించి అలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లడం అవసరం. ఆర్ఆర్ఆర్ కో స్టార్ చరణ్ ఇప్పటికే ఆచార్య రిలీజ్ చేయించి ఆర్సి 15ని సగం దాకా తీసుకొచ్చాడు. ఆ తరువాత బుచ్చిబాబు, సుకుమార్ లతో ప్లాన్ చేసుకున్నాడు. ఎంత జాతీయ స్థాయిలో మార్కెట్ పెరుగుతున్నా సరే తారక్ లాంటి స్టార్లు మరీ నెమ్మదిగా ఉన్నా ప్రమాదమే. ఆలస్యం అమృతం విషం అని చెప్పిన పెద్దలే నిదానమే ప్రధానం అన్నారు. సమయాన్ని బట్టి వీటిలో ఒకటి అన్వయించుకోవాలే తప్ప ప్రతిసారి ఒకటే సూత్రం పనిచేయదు. విషమో అమృతమో అది మారేది మన చేతుల్లోనే ఉంటుంది