Jr-NTR-thanks to nagarjunaచాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో తళుక్కుమనే జూనియర్ ఎన్టీఆర్, తాజాగా ‘బాబాయ్’కు థాంక్స్ చెప్తూ ఓ ట్వీట్ చేసారు. అయితే ఇదేదో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “పైసా వసూల్” సినిమా ‘స్టంపర్’కు సంబంధించిన ట్వీట్ కాదు. సొంత బాబాయ్ కాకపోయినా… బాలయ్య సమకాలీకుడైన అక్కినేని నాగార్జునను కూడా తారక్ ‘బాబాయ్’ అని సంభోదిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా బహిరంగ వేదికలపై కూడా జూనియర్ ఈ విధంగా మాట్లాడిన సందర్భాలున్నాయి.

మరి తాజాగా ఎందుకు ‘థాంక్స్’ చెప్పారు? అంటే… ‘బిగ్ బాస్’ షోలో నీ ఎనర్జీ సూపర్ అంటూ, మొదటి వారం వచ్చిన స్పందనకు గానూ ‘కంగ్రాట్స్’ చెప్తూ నాగార్జున ట్వీట్ చేసారు. ‘కింగ్’ ట్వీట్ చేసిన కొద్ది నిముషాలకే తారక్ ప్రతిస్పందిస్తూ… ‘చాలా థాంక్స్ బాబాయ్, మీరు వేసిన బాటలోనే మేమంతా పయనిస్తున్నాం… మీరే మార్గదర్శకులు…’ అంటూ చెప్పడంతో… వీరిద్దరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు అగ్రతారలు ఇలా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం బహు అరుదు కనుక, ఈ ట్వీట్స్ వైరల్ అవ్వడంలో తప్పు లేదులే..!