Jr NTR - Trivikram - Srinivas“అరవింద సమేత” ప్రమోషన్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ కు తారక్ – త్రివిక్రమ్ లు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్రసారం అవుతున్నాయి. ఛానల్స్ వేరైనా ప్రశ్నలు కామనే కదా… అన్న తీరుగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈ ఇద్దరూ బదులిచ్చారు.

అయితే దర్శకుడు త్రివిక్రమ్ పై తారక్ ఎంత విశ్వాసంతో ఉన్నాడో తెలపడానికి నిదర్శనంగా ఈ ఇంటర్వ్యూలలో తారక్ చేసిన పలు వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వరుస సక్సెస్ లతో ఉండగా… త్రివిక్రమ్ “అజ్ఞాతవాసి” సినిమాతో వెనుకంజలో ఉన్నారు… మరి ఈ సినిమా… అంటూ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు త్రివిక్రమ్ కంటే ముందుగా తారక్ వీటికి బదులిచ్చారు.

‘తాను అలాంటివి నమ్మనని, ఒక్క చెత్త సినిమాతో త్రివిక్రమ్ స్థాయి లాంటి వ్యక్తుల ప్రతిభలను నిర్ణయించలేమని, ఒక విఫల ప్రయత్నం త్రివిక్రమ్ గారి ప్రతిభను తగ్గిస్తుందని తాను అనుకోవడం లేదని, అలాగే తాను సక్సెస్ లో లేనపుడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు కూడా ఏమనుకుంటారు?’ అంటుండగా ‘మీ మీద ఈగ వాలనివ్వడం లేదు’ అంటూ సదరు మీడియా ప్రతినిధి పంచ్ పేల్చడంతో తారక్ – త్రివిక్రమ్ లిద్దరూ చిరునవ్వులు చిందించారు.

‘అరవింద సమేత’ ట్రైలర్ లో తాము ఏమైతే చూపించామో, రేపు సినిమాలో అదే ఉండబోతోందని, సినిమాలో ఏదో ట్విస్ట్ లు ఉంచి ప్రేక్షకులను అబ్బూరపరచాలని అనుకోవడం లేదని, సినిమా కధ గురించి చెప్పుకొచ్చారు. సిల్వర్ స్క్రీన్ పైన ‘అరవింద సమేత’లో తామేం చూపించబోతున్నామో, ఈ ఇంటర్వ్యూలలో తారక్ – త్రివిక్రమ్ లు దాదాపుగా చెప్పేసి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు.