‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకపై ఎన్టీఆర్ కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. బహుశా సినిమా బాగా వచ్చిందన్న నమ్మకమో ఏమో గానీ, మునుపటితో పోలిస్తే వ్యక్తిగత విశ్వాసం మరింత పెరిగింది. ఆ ప్రభావంతోనే తన ఫ్లాప్ సినిమాల గురించి కూడా ప్రస్తావించారు. కొరటాల శివ చెప్పిన ‘జనతా గ్యారేజ్’ సినిమా కధ రెండు సంవత్సరాల క్రితం విన్నానని, అయితే ముందుగా ఫ్లాప్ సినిమాలు చేసి ఈ సినిమా చేయాల్సి వచ్చిందని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు.
అయితే అవి ఫ్లాప్ అవుతాయని ముందే తెలియదు కదా… ప్రతి సినిమా హిట్ అవుతుందనే చేస్తాం… కానీ మిమ్మల్ని పక్కనపెట్టి అలా చేయాల్సి వచ్చింది… అలా జరిగిపోయింది… అంటూ నవ్వుతూ ‘టెంపర్’ ముందు సినిమాలపై పంచ్ లు వేసారు జూనియర్. అయితే ఈ ‘జనతా గ్యారేజ్’ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్, నా గమ్యానికి సరైన సినిమా ఇది, కొరటాల శివ ఖచ్చితంగా హ్యాట్రిక్ అందుకుంటారు… అంటూ సినిమా విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసారు.
ఇటీవల తన అభిమాని పంపించిన ఒకటి చూశానని, తన పేరును జే.ఎన్టీఆర్ గా రాసి, వెనుక నుండి వస్తూ ‘ఆర్.. అంటే రభస’ అని, ‘టి అంటే టెంపర్’ అని, ‘ఎన్ అంటే నాన్నకు ప్రేమతో’ అని, ‘జె అంటే జనతా గ్యారేజ్’ అని రాసుకుని వచ్చాడని, నిజంగానే ‘జనతా గ్యారేజ్’ సినిమా ఓ పుష్కర కాలం తర్వాత నేను ఇవ్వబోతున్న సరైన హిట్ గా అభివర్ణించారు జూనియర్ ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ వ్యక్తపరిచిన విశ్వాసం ప్రేక్షకుల్లో ఏ మేరకు ఉంటుందో సెప్టెంబర్ 2వ తేదీన తేలిపోనుంది.