Jr-NTR-and-Ram-Charan Fan War in Kodadతెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ కు శుభంకార్డు వేసిన ఘనత అభిమానులదే. హీరోలు ఎంతగా కలిసిపోయి సినిమాలు చేస్తున్నా, అభిమానుల నడుమ యుద్ధం ఆగకపోతుండడంతో, ఒకప్పుడు వెండితెరపై వెలుగుచూసిన మల్టీస్టారర్ మూవీస్ తెలుగునాట కనుమరుగయ్యాయి.

అయితే మారిన ట్రెండ్ నేపధ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నుండి పెద్ద హీరోలు కూడా మల్టీస్టారర్ వైపు మొగ్గు చూపారు. ఒకే స్థాయి కలిగిన ఇద్దరు హీరోలు చేయకపోవడంతో, అభిమానుల ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేకుండా పోయింది.

కానీ “ఆర్ఆర్ఆర్” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల ‘మెగా – నందమూరి’ కలయికను ఏకం చేసిన రాజమౌళి, విజయవంతంగా షూటింగ్ ను ముగించుకుని, ఆ ఇద్దరు హీరోలతో దేశమంతా పబ్లిసిటీ కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు.

ఇరువురు హీరోల అభిమానులు కూడా సఖ్యతగా ఉండాలని ఇద్దరు హీరోలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పిలుపునిచ్చారు. కధ ఇక్కడి వరకు సజావుగా సాగింది. కానీ తొలిసారిగా కోదాడలో చెర్రీ – తారక్ ఫ్యాన్స్ నడుమ వార్ ప్రారంభమైంది.

అభిమానుల యుద్ధం సర్వసాధారణం అనుకుంటే పొరపాటే, ఈ గొడవలో ఏకంగా ఎన్టీఆర్ అభిమాని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని స్థాయికి వరకు వెళ్లిపోవడం శోచనీయం. పక్కనే ఉన్న కొంతమంది దానిని అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏ దుర్వార్త వినాల్సి వచ్చేదో?

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరువురు హీరోల అభిమానులను స్టేషన్ కు తీసుకు వెళ్లారు. కేవలం ఓ ఫ్లెక్సీ కట్టే విషయం ఏర్పడిన ఘర్షణ చివరకు పోలీస్ స్టేషన్ వరకు దారి తీసింది. ఈ వివాదం ఇక్కడితో సమసిపోతే పెద్ద ఇబ్బందేమీ ఉండదు.

ఏపీ, తెలంగాణాలో అశేష అభిమానగణం కలిగిన ఇద్దరు హీరోల అభిమానుల నడుమ చెదురు మదురు సంఘటనలు జరగడం సహజమే. ఎందుకంటే ప్రతి చోటా నియంత్రించడం ఇటు హీరోలకు గానీ, అటు పోలీసులకు గానీ సాధ్యం కానిది.

అయితే ఈ ఘర్షణలు ఏకంగా ఆత్మహత్యలకు దారి తీసుకునేలా చేసుకోవడం అనేది, అభిమానులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా అలా చేసుకుంటే వారి అభిమాన హీరోలు నటించే సినిమాలు చూడగలుగుతారా? ఇంకా ఆ అభిమానంలో అర్ధం ఏముంటుంది?

చక్కగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయక, ఎందుకొచ్చిన గొడవలు ఇవన్నీ! ఒక బ్యానర్ ఆ హీరో ఫ్యాన్ ఎక్కువ కట్టుకుంటే ఏముంది? లేక మరో హీరో కటౌట్ పెద్దగా కట్టుకుంటే ఏముంటుంది? చివరికి బాక్సాఫీస్ వద్ద బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యిందా? లేదా? ఇదే కదా అసలు లెక్క!