Jr NTR, Ram Charan and Rajamouli RRRసినిమా ఫస్ట్ షో పడిన దగ్గర నుండి ఎవరెవరు ఎంత రేటింగ్ ఇచ్చారు? మన ఫ్యాన్స్ చెప్తున్న టాక్ ఏంటి? ప్రత్యర్థి ఫ్యాన్స్ వెల్లడిస్తున్న టాక్ ఏంటి? ఏ ఏరియాలో ఎంత వసూలు అవుతోంది? ఓవర్సీస్ లో ఎన్ని మిలియన్స్ కు కలెక్ట్ చేస్తుంది? ఇలా అనేకానేక వాటిల్లో తలమునకలై ఉన్నా, అంతిమంగా రికార్డులు బద్దలు కొట్టే వసూళ్లు ప్రకటించినప్పుడు మాత్రం వారి ఆనందానికి అవధులు ఉండవు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు అదే సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడం అనేది నిజంగా ఇద్దరు హీరోలు మీసాలు మెలేసినట్లే! మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో హిందీలో మొదటి రోజు 19 కోట్లతో ప్రారంభించినప్పటికీ, రెండవ రోజు 24 కోట్లు, మూడవ రోజు ఏకంగా 31.50 కోట్లు వసూలు చేసి చరిత్ర తిరగరాసే విధంగా ముందుకెళ్తోంది.

ఇక తెలుగు నాట ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతూ, రాబోయే కొద్ది కాలంలో మరొకరికి సాధ్యం కానీ రీతిలో కలెక్షన్స్ ను అందుకుంటోంది “ఆర్ఆర్ఆర్.” ఈ భారీ ఓపెనింగ్స్ తో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్తు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కొత్త ఉత్సాహంలోకి ఈ సినిమా నెట్టివేసింది.

ఓవర్సీస్ లో కూడా వండర్స్ ను సృష్టిస్తోంది మన “ఆర్ఆర్ఆర్.” గడిచిన వీకెండ్ లో హాలీవుడ్ సినిమాలను దాటిపోయే విధంగా ఉన్న కలెక్షన్స్ ను చూసి అక్కడ మీడియా కూడా మన సినిమాపై కధనాలను ప్రచురితం చేసిందంటే, ‘ఆర్ఆర్ఆర్’ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన సమాచారంతో కిక్ మీద కిక్ ఇస్తోన్న ఫ్యాన్స్, రిపీట్ మోడ్ ను ఆన్ చేయకుండా ఉండగలరా?

500 కోట్లు నుండి 750 కోట్లకు పరిగెడుతున్న “ఆర్ఆర్ఆర్” ఊపు అంతిమంగా ఎక్కడ నిలుస్తుందో? అన్న ఆలోచన సర్వత్రా నెలకొంది. ఎందుకంటే “బాహుబలి 2” సినిమాతో అనితర సాధ్యమైన రికార్డులను సొంతం చేసుకున్న జక్కన్న “ఆర్ఆర్ఆర్” కలెక్షన్స్ ను ముందుగానే అంచనా వేయడం సాధ్యం కాని రీతిలో ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి 750 కోట్లను అధిగమిస్తుందన్న లెక్కలైతే ట్రేడ్ వర్గీయులు వేస్తున్నారు.