Jr NTR on Politicsజూనియర్ ఎన్టీఆర్ ను, రాజకీయాలను వేరు చేసి మాట్లాడలేం అన్నంతగా గతంలో తాను చేసిన ప్రచారంతో ప్రేక్షకులలో, అభిమానులలో ఓ చెరగని ముద్ర వేసాడు. అయితే అదే తారక్ సినీ కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. అప్పటినుండి వరుస వైఫల్యాలతో ఉన్న జూనియర్, ‘టెంపర్’ సినిమాతో కోలుకుని, మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ‘జనతా గ్యారేజ్’తో సూపర్ హిట్ అందుకున్న బుడ్డోడు, ప్రస్తుతం ‘జై లవకుశ’తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కోసం టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనపడుతోంది.

దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో సందడి చేస్తుండగా, సహజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై విస్పష్టమైన జవాబిచ్చిన తారక్… చాలా సార్లు చాలా సందర్భాలలో తాను చెప్పాలని, ఇది సరైన సమయం కాదని తాను భావిస్తున్నానని, ఏదైనా తాను మాట్లాడేటపుడు స్పష్టంగా చెప్పాలని తాను కోరుకుంటానని, కానీ ప్రస్తుతం దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని, ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తానని, ప్రస్తుతానికి దీనిని ముగిద్దామని తన ఉద్దేశాన్ని చెప్పారు.

అయితే తారక్ చెప్పిన వివరణలో తన ఉద్దేశం ఏమిటో… అర్ధం చేసుకునే వారికి స్పష్టమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తనకు రాజకీయాలపై ఆలోచన లేదన్న విషయం అయితే చెప్పారు గానీ, మహేష్ మాదిరి తాను ఎప్పటికి రాను అని మాత్రం చెప్పలేకపోయారు. జూనియర్ చెప్పినా, లేకున్నా… పదేళ్ళకో, ఇరవై ఏళ్ళకో, ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా పొలిటిక్స్ లోకి అడుగు పెడతారన్న విషయమైతే దాదాపుగా ఖరారైన అంశం. ప్రస్తుతానికి అయితే ‘జై లవకుశ’ వంటి డిఫరెంట్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయడమే వీక్షకుల వంతు!