jr ntr not reacting on NTR Name Changing issueఎన్టీఆర్‌ జయంతి, వర్దంతి వస్తే ముందుగా వినపడేవి జూ.ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి పేర్లే. ఆ సందర్భంగా వారు హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయన గొప్పదనం గురించి, ఆయనతో తమకున్న అనుబందం గురించి మాట్లాడుతుంటారు. ఈ రెండు సదంర్భాలలోనే లక్ష్మీ పార్వతికి తన ఉనికిని చాటుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆమె మరికాస్త ఎక్కువ మాట్లాడుతుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పటికీ ఇంతవరకు వారిరువురూ స్పందించలేదు. ఇద్దరికీ భిన్నమైన ఇబ్బందులు ఉన్నాయి.

వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఎన్టీఆర్‌ ఖండిస్తే ఏపీలో ఆయన సినిమాలకు ఇబ్బందులు మొదలవుతాయి. స్పందించకపోతే టిడిపిలో ఆయన అభిమానులు అసంతృప్తి చెందవచ్చు. కనుక కర్ర విరగకుండా పాము చావకుండా ఏవిదంగా స్పందించాలని ఆలోచిస్తున్నట్లున్నారు. ఎన్టీఆర్‌ నట, రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ నిర్ణయం తెలుగుజాతికి అవమానించడమే అని అన్నారు.

లక్ష్మీ పార్వతి వైసీపీలో ఉన్నారు కనుక తొందరపడి నోరుజారితే జగన్ ఆగ్రహానికి గురికావలసివస్తుంది. వైసీపీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి ఎన్టీఆర్‌ వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరి పరిస్థితి ఇదే. కనుక ఆమెతో సహా అందరూ మనసులో బాధపడున్నప్పటికీ నోరు కట్టేసుకోక తప్పడం లేదు. వారిలో లక్ష్మీ పార్వతి తప్ప మిగిలినవారు నోరు కట్టేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందీ ఉండక పోవచ్చు కానీ ఆమె మాత్రం ఇప్పుడు స్పందించకపోతే రేపు ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతి రోజున ఇదే ప్రశ్నకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. కనుక ఆలస్యం చేయకుండా సజ్జలనో, అంబటినో సంప్రదించి ఏదో ఒకటి చెప్పక తప్పదు.

ఈ నిర్ణయంతో టిడిపి ఏడుస్తుంటే చూసి ఆనందించాలని సిఎం జగన్‌ అనుకొంటే, సొంత పార్టీలో నేతలలోనే అసంతృప్తి సెగలు రాజేసుకొన్నారు. టిడిపికి తన ప్రభుత్వంపై సందించేందుకు మరో దివ్యాస్త్రం అందించారు. త్వరలోనే ఇది మరింత స్పష్టంగా అర్దమవుతుంది.