Jr-NTR-fansకుటుంబంలో కలహాలు ఉంటే నాలుగు గోడలమధ్యే చూసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారిలోవారే తేల్చుకోవాలి. అదే కలహాలను బహిరంగంగా ప్రదర్శిస్తే ఇంటి పరువు బజారున పడటమే కాకుండా ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది. దాని వల్ల చేటు కలిగేది కుటుంబం మొత్తానికి కదా! మరి ఇంత చిన్న లాజిక్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎందుకు మిస్ అవుతున్నారు అనే చర్చ ప్రస్తుతం జోరుగానే సాగుతుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే దిగ్గజ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు యొక్క శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు కేవలం రాష్ట్రానికి చెందిన ప్రముఖులనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులను మరియు విదేశాల్లో ఉన్న ప్రముఖులను సైతం ఆహ్వానించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ పోరంకిలోని అనుమోల్ గార్డెన్స్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ మరియు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లను టీడీపీ శ్రేణులు ఆహ్వాహించారు.

ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న నందమూరి బాలకృష్ణకు పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడ చేరుకున్న రజనీకాంత్ కు స్వయంగా బాలకృష్ణ ఎదురువెళ్లి పార్టీ శ్రేణులతో కలసి స్వాగతం పలికారు.

ఈ ఉత్సవాల ద్వారా పార్టీ శ్రేణుల్లో మరియు కార్యకర్తల్లో నూతన ఉత్సహాన్ని నింపడమే కాకుండా రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను అన్ని విధాలుగా సిద్ధం చేయొచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ పక్క లోకేష్ పాదయాత్ర, మరో పక్క “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు రోడ్ షోలు, తాజాగా సంవత్సరం పొడవునా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ వెరసి ప్రజల్లో టీడీపీ నినాదం బలంగా వెళ్తుందనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది.

కానీ ఇంత పక్కా ప్రణాళికతో, రాజనీతి చతురతతో.. బలంగా ఉన్న వైసీపీ పైకి యుద్దానికి సిద్దమవుతున్న చంద్రబాబు.. అనవసరంగా ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇస్తున్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ సొంత పార్టీలోనే ఓ వర్గం నుండి విమర్శలు వస్తున్నాయి. కుండలో ఎంత నీరు పోసిన ఆ కుండకు చిల్లు ఉంటే నీరు ఎట్లా నిలుస్తాయి అనే విమర్శలు సామాన్య కార్యకర్తల నుండి వినిపిస్తున్నాయి.

ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాలకు పక్క రాష్ట్రం నుండి సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ని ఆహ్వానించారు కానీ, ఎన్టీఆర్ సొంత మనవడు, గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ లను ఎందుకు ఆహ్వానించలేదు అనే విమర్శలు చంద్రబాబు పై నందమూరి అభిమానులు బహిరంగంగానే చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అంటే బాబుకి ఎందుకంత మంట, ఆయన సతీమణి భువనేశ్వరి పై చేసిన విమర్శలకు ఘాటు కౌంటర్లు ఇవ్వలేదనా లేక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సరిగ్గా స్పందించలేదనా లేక లోకేష్ కి ప్రాధాన్యం తగ్గిపోతుందనా.. దేనికి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత కోపం బాబుకి అనే విమర్శలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయం అనే విమర్శలు వస్తున్నాయి. ఇదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టడం వల్ల ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఓట్లపై కూడా పడుతుందనేది విశ్లేషకుల మాట.

మరి ఈ పరిస్థితులకు బాబు ఓ ముగింపు పలుకుతారా లేక మొండిగానే ముందుకు వెళ్తారా వేచిచూడాల్సిందే.